సీనియారిటీ జాబితా తయారీ గడువు పొడిగింపు

27 Jul, 2021 08:20 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల సీనియారిటీ జాబితా రూపకల్పన గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. ఉపాధ్యాయ బదిలీల్లో న్యాయ తదితర వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం కొత్త షెడ్యూల్‌ 
విడుదల చేశారు.  

అన్ని క్యాడర్ల టీచర్లకూ సీనియారిటీ జాబితా 
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ తత్సమాన తదితర క్యాడర్ల ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను తయారు చేసి ఆగస్టు 1వ తేదీ నాటికే వెబ్‌సైట్‌లో ప్రదర్శించాల్సి ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా సీనియారిటీ జాబితాల తయారీ గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ విడుదల చేశారు. వీటన్నింటినీ పూర్తి చేశాక ఉపాధ్యాయులకు నెలవారీగా పదోన్నతులు అమలు చేయనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ తన ఉత్తర్వుల్లో  పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై ఏపీ ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం హర్షం వ్యక్తం చేశారు.

తాజా షెడ్యూల్‌ ఇలా.. 
► ఆగస్టు 10వ తేదీ నాటికి ఉపాధ్యాయుల సీనియారిటీ వివరాలు సేకరించాలి.
►  ఆగస్టు 18 వ తేదీ నాటికల్లా ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయుల తాత్కాలిక  సీనియారిటీ జాబితాలను వెబ్‌సైట్‌లో ఉంచాలి.
►  ఆగస్టు 31వ తేదీకల్లా జాబితాపై టీచర్లు తమ అభ్యంతరాలను తెలియజేయాలి
►  సెప్టెంబర్‌ 12వ తేదీ నాటికి ఆ అభ్యంతరాలను అధికారులు పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపడతారు.
►  సెప్టెంబర్‌ 15వ తేదీ నాటికల్లా దాదాపు అన్ని క్యాడర్ల తుది సీనియారిటీ జాబితాలను విడుదల చేస్తారు.

మరిన్ని వార్తలు