నెట్టింట 'బుడి బుడి' బడి

27 May, 2021 04:48 IST|Sakshi
పిల్లలకు సెల్‌ఫోన్‌లో పాఠాలు నేర్పుతున్న తల్లి

ఆన్‌లైన్‌లో అంగన్‌వాడీ చిన్నారులకు బోధన

‘ఇంటివద్దకే విద్య’ పేరుతో వంద రోజుల కార్యక్రమం

కృష్ణా జిల్లాలో 67,357 మందికి శిక్షణ ప్రారంభం

తల్లులకు ఆన్‌లైన్‌లో అవగాహన

సాక్షి, విజయవాడ: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు విద్యపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఆటపాటలతో రూపొందించిన పాఠాలు బోధిస్తున్నారు. కరోనా కాలంలో చిన్నారులకు ఈ బోధన చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటివద్దకే విద్య’ పేరుతో వైఎస్సార్‌ ప్రీ–ప్రైమరీ విద్యను అందించాలని నిర్ణయించింది. వంద రోజుల ప్రణాళికను రూపొందించి ఈ శిక్షణ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించారు.

వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు
చిన్నారుల తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌ నంబర్లతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు అర్థమయ్యేలా రోజుకో అంశంపై పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. యూట్యూబ్‌ ద్వారా ఈ పాఠాలను ఎంపిక చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేస్తారు. దీనివల్ల చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లకుండా ఇంట్లో ఉంటూ ఆటపాటలతో విద్య అందుతోంది. 

3,812 కేంద్రాల్లో విద్యాబోధన
కృష్ణా జిల్లాలో 3,812 అంగన్‌వాడీ కేంద్రాల్లో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి 67,357 మంది ప్రీ స్కూల్‌ పిల్లలకు విద్యాబోధన అందిస్తున్నారు. 32 నుంచి 72 నెలల వయసు కలిగిన చిన్నారులు ఇంట్లోనే ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా పద్యాలు, పాటలు చిత్రాలు తల్లుల ఫోన్లకు పంపుతున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు వాట్సాప్‌ గ్రూపుల్లో పొందుపరుస్తూ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం సరుకుల వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే తక్షణమే గ్రూపులో సమాచారం పొందుపరిస్తే దగ్గరలో ఉన్న ఏఎన్‌ఎంల ద్వారా అంగన్‌వాడీలు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. 

కోవిడ్‌పై అవగాహన
చిన్నారులు, బాలింతలు, గర్భిణులు కోవిడ్‌ బారిన పడకుండా అంగన్‌వాడీలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు సూచిస్తూ వారిని చైతన్యపరిచేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. వ్యాక్సిన్‌పై అవగాహన కలిగిస్తూ అందరూ వ్యాక్సిన్‌ వేసుకున్నదీ, లేనిది వాట్సాప్‌ గ్రూపుల్లో పొందుపరుస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా అంగన్‌వాడీ నిర్వహణ సమయం కుదించి కర్ఫ్యూ సమయం కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా సమయంలో ఉపయుక్తంగా ఉంది..
కరోనా సమయంలో చిన్నారులు స్కూలుకు రావడం కుదరదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇళ్లలోనే ఉంటున్నారు. ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతోంది. తల్లుల వద్ద ఉండి పాఠాలు నేర్చుకుంటున్నారు. పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు.
– వెంకటలక్ష్మి, సీడీపీవో, గన్నవరం 

మరిన్ని వార్తలు