పోలవరం ప్రాజెక్ట్‌ సవాళ్లను ఎదుర్కొనే కసరత్తు కొలిక్కి

24 Apr, 2022 05:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ ప్రధాన డ్యామ్‌ పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధించిన కసరత్తును ఢిల్లీ–ఐఐటీ రిటైర్డ్‌ డైరెక్టర్, ప్రొఫెసర్‌ వీఎస్‌ రాజు నేతృత్వంలోని 8 మంది నిపుణుల బృందం పూర్తి చేసింది. గోదావరి వరదల ఉధృతికి ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను డ్రెడ్జింగ్, వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా పూడ్చే విధానాన్ని నిపుణుల బృందం రూపొందించింది. డయా ఫ్రమ్‌ వాల్‌ పరిస్థితిని అంచనా వేసి.. దాని పటిష్టతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది.

బావర్‌ సంస్థ ఇచ్చే నివేదిక, గోతులను పూడ్చే విధానంపై డీడీఆర్పీకి పోలవరం సీఈ సుధాకర్‌బాబు పంపనున్నారు. సవాళ్లను ఎదుర్కొనే విధానాన్ని వారంలోగా డీడీఆర్పీ ఖరారు చేస్తుంది. కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు  శ్రీరామ్‌ సూచనల మేరకు ప్రొఫెసర్‌ రాజు నేతృత్వంలోని బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుకను నింపి పూడ్చే పనులు పరిశీలించింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను పరిశీలించింది.

శనివారం పోలవరంలో రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులతో నిపుణుల బృందం సమావేశమైంది. రెండు కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన నీటిని తోడకుండానే ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను డ్రెడ్జింగ్‌ చేస్తూ.. వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా పూడ్చే విధానాన్ని రూపొందించింది. ప్రధాన డ్యామ్‌ డయా ఫ్రమ్‌ వాల్‌ పటిష్టతపై అధ్యయనం చేసే బాధ్యతను బావర్‌కు అప్పగించింది.

ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా  కొత్త డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మించి.. పాత డయాఫ్రమ్‌ వాల్‌తో అనుసంధానం చేయాలా లేదంటే ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలా అన్న అంశాన్ని డీడీఆర్పీకి నివేదిస్తారు. డీడీఆర్పీ ఖరారు చేసే విధానాన్ని సీడబ్ల్యూసీకి పంపి.. అది ఆమోదించిన విధానం ప్రకారం ఆ పనులు చేపడతారు.  

మరిన్ని వార్తలు