ఎర్రచందనానికి సాంకేతిక రక్ష

2 May, 2022 04:06 IST|Sakshi

ఈ వృక్షాల పరిరక్షణకు అత్యాధునిక రక్షణ వ్యవస్థ  

చెట్టు కూలితే తెలిసేలా సౌండ్‌ అండ్‌ మోషన్‌ సెన్సార్లతో నిఘా 

హై రిజల్యూషన్‌ శాటిలైట్‌ డేటాతో పర్యవేక్షణ 

డ్రోన్‌ కెమెరాలు, నంబర్‌ ప్లేట్‌ రీడర్లతో అక్రమ రవాణాకు చెక్‌ 

స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించడమే లక్ష్యం 

సాక్షి, అమరావతి: ఎర్రచందనం అక్రమంగా రవాణాను మరింత సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనుంది. ఇప్పటికే బేస్‌క్యాంప్‌లు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు, చెక్‌పోస్టులు, ఈ–నిఘా ద్వారా స్మగ్లర్ల కార్యకలాపాలను చాలావరకు నిరోధించింది. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుని స్మగ్లర్లు అడుగు ముందుకువేసే పరిస్థితి లేకుండా చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. హై రిజల్యూషన్‌ శాటిలైట్, లైడార్‌ డేటా ద్వారా ప్రతి చెట్టును పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. చెట్లు కూలిపోయినప్పుడు తెలుసుకునేందుకు సౌండ్‌ అండ్‌ మోషన్‌ సెన్సార్‌ను కొన్ని కీలకమైన పాయింట్లలో అమర్చనున్నారు. అలాగే జియో రిఫరెన్సింగ్‌ద్వారా కూడా చెట్లను పర్యవేక్షించనున్నారు. అటవీ ప్రాంతాల్లోని రోడ్లు, వ్యూ పాయింట్ల వద్ద హై రిజల్యూషన్‌ ఐపీ కెమెరాలు అమర్చడం ద్వారా చీమచిటుక్కుమన్నా తెలిసిపోయేలా నిఘాను పటిష్టం చేసేందుకు రంగం సిద్ధమైంది. డ్రోన్‌ కెమెరాలతో అడవిలోని మారుమూల ప్రాంతాలను సైతం స్పష్టంగా జల్లెడ పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

అక్రమంగా అడవి దాటించడం అంత ఈజీ కాదు 
ఎర్రచందనం వృక్షాలున్న అటవీ ప్రాంతాల్లో తిరిగే వాహనాల సమాచారం తెలుసుకునేందుకు నంబర్‌ ప్లేట్‌ రీడర్స్‌ ఉన్న ఆటోమేటిక్‌ కెమెరాలను (నంబర్‌ ప్లేట్‌ను స్కాన్‌చేసి ఆ వాహనం వివరాలు తెలుపుతుంది) సిద్ధం చేస్తున్నారు. దుంగలను తరలించే వాహనాలను గుర్తించేందుకు అడ్వాన్స్‌డ్‌ వెహికల్‌ స్కానర్లను వినియోగించనున్నారు. దీనికితోడు ఎర్రచందనం కేసుల్లో ఉన్న పాత నేరస్తులను గుర్తించేందుకు ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ వ్యవస్థను సమకూరుస్తున్నారు. వారి పూర్తి సమాచారంతో డేటాబేస్‌ సిద్ధం చేస్తున్నారు. ఈ డేటాను చెక్‌పోస్టులు, ఫేస్‌ డిటెక్షన్‌ యాప్స్‌తోపాటు పోలీసు, కస్టమ్స్‌ విభాగాలతో అనుసంధానం చేస్తున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఎర్ర చందనం దుంగల్ని నరకడం, అక్రమంగా తరలించడం దాదాపు అసాధ్యమని అటవీ అధికారులు చెబుతున్నారు. ఏడాదిలోపే ఈ వ్యవస్థలను అమల్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధమవుతోంది.

20 సంవత్సరాల్లో 17 వేల కేసులు 
గత 20 సంవత్సరాల్లో అక్రమంగా తరలిస్తున్న 15 వేల మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం దుంగల్ని, 10 వేల వాహనాల్ని పోలీసు, అటవీశాఖల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 17 వేల కేసులు పెట్టి 30 వేలమందికిపైగా నిందితుల్ని అరెస్టు చేశారు. 2021–22లో 133.57 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. 255 కేసులు నమోదు చేసి 635 మందిని అరెస్ట్‌ చేసి 144 వాహనాలను సీజ్‌చేశారు.  

అంతరించే దశలో.. 
అంతరిస్తున్న వృక్షాల జాబితాలో ఉన్న ఎర్రచందనం రాయలసీమ అటవీ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా ఎర్రచందనం వృక్షాలు పెరగవు. అందుకే ఈ దుంగల్ని అక్రమంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తారు. ఉమ్మడి వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ అడవుల్లో 5.30 లక్షల హెక్టార్లలో ఈ వృక్షాలున్నాయి. సుమారు 5,300 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్రచందనం చెట్లు ఉన్నట్లు అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో 3,063 చదరపు కిలోమీటర్లలో, నెల్లూరు జిల్లాలో 671.17, చిత్తూరు జిల్లాలో 1,090, ప్రకాశం జిల్లాలో 263, కర్నూలు జిల్లాలో 212 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు