International Cigarettes Day: ఒక సిగరెట్‌ మీ జీవితకాలాన్ని ఎంత తగ్గిస్తుందో తెలుసా!

31 May, 2022 20:12 IST|Sakshi

ఒక సిగరెట్‌ నిమిషం జీవితకాలాన్ని తగ్గించేస్తుంది

సిగరెట్లు, చుట్టలకు ఏడాదికి చేస్తున్న ఖర్చు రూ.1.20 కోట్లు 

సాక్షి, విజయనగరంఫోర్ట్‌: ధూమపానం కారణంగా గుండెపోటు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు గురైన ప్రతి ముగ్గురులో ఒకరు ధూమపానం కారణంగానే ప్రమాదకర పరిస్థితికి చేరుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సిగరెట్, చుట్టు తాగడం ఫ్యాషన్‌ మారి ఒకరి నుంచి మరొకరు అలవాటు చేసుకుంటున్నారు. జిల్లాలో పొగతాగే వారు 30 శాతం వరకు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఒక సిగరెట్‌ కాలిస్తే జీవితకాలం నిమిషం తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం చేసే వారితో పాటు పక్కనున్న వారు కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో  నిరాక్షరాస్యులు, గ్రామీణులు ఎక్కువుగా సిగరెట్, చుట్టలు తాగేవారు. కాని నేడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ పొగ తాగుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా వ్యసనానికి బానిస కావడం ఆందోళన కలిగించే విషయం. పొగ తాగుతున్న వారిలో 8 శాతం మంది యువత ఉండడం గమనార్హం.  

ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి.. 
సిగరెట్, చుట్ట తాగడం వల్ల ప్రాణంతకమైన క్యాన్సర్‌ వ్యాపించే అవకాశం ఉంది. గొంతు, నోరు, ఊపరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు క్రానిక్‌ బ్రాంక్‌లైటీస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఏడాదికి జిల్లాలో క్యాన్సర్‌ బారిన 2 నుంచి 5 శాతం మంది పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్స్‌తో మరో పది శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. 

గుర్తించకపోవడంతో ప్రమాదం.. 
గొంతు, నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగా గుర్తించకపోవడం వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

ఏడాదికి రూ.1.20 కోట్లు 
అన్ని రకాల వర్గాల వారికి సిగరెట్లు, చుట్టలు అంటుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఏడాదికి 1.20 కోట్ల వరకు ధూమపానానికి ఖర్చు చేస్తున్నారు.

జీవితకాలం తగ్గిపోతుంది.. 
 సిగరెట్లు తాగడం వల్ల జీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా 70 ఏళ్లు జీవించేవారు 60 నుంచి 65 ఏళ్లకే మరణిస్తారు. చిన్న వయసులోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ఊపరితిత్తులు, గొంతు, అన్నవాహిక, మూత్రాశ్రయం, లివర్‌ పాడవుతాయి.    
– వి. విజయ్, పలమనాలజిస్ట్, విజయనగరం

మరిన్ని వార్తలు