కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట

4 May, 2022 04:45 IST|Sakshi

శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి వాడుకోకూడదంటూ వాదన

అంతకుమించి వాడుకుంటే.. కృష్ణా జలాల్లో చెరిసగం పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ

తెలంగాణ వ్యవహారశైలిని తప్పుపడుతున్న నిపుణులు

ప్రాజెక్టుల వారీగా బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపు ఆధారంగానే ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు

వాటాగా దక్కిన జలాలను రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛనిచ్చిన ట్రిబ్యునల్‌

దిగువ రాష్ట్రమైన ఏపీకి వరద జలాలనూ వినియోగించుకునే స్వేచ్ఛ

ఈ జలాలను ఏపీ వాడుకోవడం తప్పెలా అవుతుందంటున్న నిపుణులు

సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నీటిపారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ 34 టీఎంసీల (ఎస్సార్బీసీకి 19, చెన్నై తాగునీటికి 15)ను మాత్రమే వాడుకుంటేనే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు నీటిని పంపిణీ చేయాలని సోమవారం కృష్ణాబోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 34 టీఎంసీల కంటే అధికంగా వాడుకుంటే.. కృష్ణాజలాల్లో ఏపీ, తెలంగాణలకు చెరిసగం పంపిణీ చేయాలని.. ఇదే అంశాన్ని గత సమావేశంలో ప్రస్తావించినా వాటిని మినిట్స్‌లో పేర్కొనలేదని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 6న జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరడంపై నిపుణులు నివ్వెరపోతున్నారు. 

‘బచావత్‌’ కేటాయింపులే ఆధారం
బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా ఉమ్మడి రాష్ట్రానికి చేసిన 811 టీఎంసీల కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015, జూన్‌ 19న కేంద్రం తాత్కాలిక ఒప్పందం కుదుర్చింది. దీనిపై అటు తెలంగాణ.. ఇటు ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. 2015–16, 2016–17 సంవత్సరాల్లో ఇదే పద్ధతిలో కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. 2017, నవంబర్‌ 4న జరిగిన బోర్డు సమావేశంలో.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు ప్రతిపాదించాయి. దాంతో.. ఆ పద్ధతి ప్రకారమే 2017–18, 2018–19, 2020–21, 2021–22లలో కృష్ణాబోర్డు నీటిని పంపిణీ చేసింది.

ఏమిటీ వితండ వాదన..
ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌.. వాటాగా దక్కిన జలాలను రాష్ట్రంలో ఎక్కడైనా వినియోగించుకునే స్వేచ్ఛనూ ఇచ్చింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కూడా కొనసాగించింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఇప్పటికీ బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పే అమల్లో ఉంది. ఇక వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చింది. ట్రిబ్యునల్‌ కేటాయింపుల ద్వారా హక్కుగా దక్కిన జలాలను.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవాతోపాటు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ వాడుకోవడం తప్పెలా అవుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమల్లోకి వచ్చినా.. కృష్ణా జలాల్లో ఏపీ వాటా ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులకు వాస్తవాలు తెలిసి కూడా వితండవాదనకు దిగడాన్ని వారు తప్పుపడుతున్నారు.   

మరిన్ని వార్తలు