తీరు మారని తెలంగాణ సర్కార్‌

17 Nov, 2021 03:29 IST|Sakshi
సాగర్‌ డ్యాంను పరిశీలిస్తున్న కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ

కృష్ణా బోర్డు సబ్‌ కమిటీకి సహాయ నిరాకరణ

సాగర్‌ ప్రధాన విద్యుత్‌ కేంద్రం, ఎడమ కాలువ పరిశీలనకూ నో

స్పిల్‌ వే, ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్, ఏఎమ్మార్పీ, వరద కాలువ పరిశీలనకే అనుమతి

సహాయ నిరాకరణపై బోర్డు చైర్మన్‌కు నివేదిక ఇస్తామన్న సబ్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌కే పిళ్లై

సాక్షి, అమరావతి/విజయపురిసౌత్‌ (మాచర్ల): నాగార్జునసాగర్‌ పరిశీలనకు కృష్ణా బోర్డు సబ్‌ కమిటీని అనుమతించినట్లుగానే అనుమతించిన తెలంగాణ సర్కార్‌ ఆ తర్వాత యథావిధిగా అడ్డం తిరిగింది. ప్రధాన విద్యుత్‌ కేంద్రం, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్‌ కేంద్రం పరిశీలనకు సబ్‌ కమిటీని అనుమతించేది లేదని తెలంగాణ జెన్‌కో అధికారులు తేల్చిచెప్పారు. సాగర్‌ నిర్వహణ నియమావళిని రూపొందించేందుకు క్షేత్రస్థాయి పర్యటనను సోమవారం సబ్‌ కమిటీ చేపట్టింది. సోమవారం కుడి కాలువ విదుŠయ్త్‌ కేంద్రం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను పరిశీలించిన సబ్‌ కమిటీ..మంగళవారం సాగర్‌ స్పిల్‌ వే, ఏఎమ్మార్పీ, ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్, వరద కాలువలను పరిశీలించింది. సాగర్‌ ప్రధాన విద్యుత్‌ కేంద్రం, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్‌ కేంద్రం పరిశీలించేందుకు వెళ్లిన సబ్‌ కమిటీని తెలంగాణ జెన్‌కో అధికారులు అడ్డుకున్నారు.

శ్రీశైలం, సాగర్‌ల నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను బోర్డు స్వాధీనం చేయడానికి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయని..అందులో సాగర్‌ ప్రధాన విద్యుత్‌ కేంద్రం, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్‌ కేంద్రం ఉన్నాయని.. వాటిని పరిశీలించడానికి అనుమతివ్వాలని సబ్‌ కమిటీ చైర్మన్‌ ఆర్కే పిళ్లై చేసిన సూచనను తెలంగాణ జెన్‌కో అధికారులు తోసిపుచ్చారు. గత నెల 26న శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం పరిశీలనకూ ఇదే తరహాలో అనుమతి ఇవ్వలేదని..వారం రోజుల్లోగా విద్యుత్‌ కేంద్రాల పరిశీలనకు అనుమతివ్వకపోతే అదే అంశాన్ని కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు నివేదిక ఇస్తామని చెప్పారు.

తెలంగాణ జెన్‌కో సీఎండీతో చర్చించి తుది నిర్ణయం చెబుతామని అధికారులు చెప్పడంతో సబ్‌ కమిటీ వెనుతిరిగింది. ఆ తర్వాత సాగర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి తెలంగాణ జెన్‌కో సీఈ గైర్హాజరయ్యారు. దాంతో సాగర్‌ సీఈ, 2 రాష్ట్రాల ఎస్‌ఈలతో సబ్‌ కమిటీ సమీక్ష చేపట్టింది. సాగర్‌ కుడి కాలువకు సంబంధించిన కార్యాలయాలు, సిబ్బంది తదితర వివరాలను ఏపీ అధికారులు అందజేశారు. కానీ..ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ, వరద కాలువ తదితర ప్రాజెక్టుల వివరాలను తెలంగాణ నీటిపారుదల అధికారులు మౌఖికంగా మాత్రమే చెప్పడంపై పిళ్లై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను అందజేయాలని, అప్పుడే ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి ముసాయిదాను రూపొందించడానికి అవకాశముంటుందని తేల్చిచెప్పారు. 

మరిన్ని వార్తలు