అక్కడో న్యాయం.. ఇక్కడో న్యాయమా?

15 Apr, 2021 04:26 IST|Sakshi

అనుమతి లేకుండా 178.93 టీఎంసీలు తరలించేలా 8 ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ

వాటిని నిలుపుదల చేయాలని ఆదేశించిన అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌

అయినా పనులు చేస్తుండటంతో కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఫిర్యాదు

వాటిని పట్టించుకోకుండా ‘రాయలసీమ ఎత్తిపోతల’ పరిశీలనకు ఏర్పాట్లు చేయాలన్న కృష్ణా బోర్డు చైర్మన్‌ 

సాక్షి, అమరావతి: అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టుల పనులను ఆపాల్సింది పోయి, వాటా నీటిని వాడుకుని పాత ఆయకట్టును స్థిరీకరించడానికి ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించడానికి ఏర్పాట్లు చేయాలని కృష్ణా బోర్డు పదే పదే కోరడంలో ఆంతర్యమేమిటని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బేసిన్‌లో ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డుకు ఆ  ప్రాజెక్టు డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పంపి.. అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తీసుకోవాలి. కానీ.. తెలంగాణ సర్కార్‌ 2015లో ఎలాంటి అనుమతి తీసుకోకుండా శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీలను తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, 30 టీఎంసీలను తరలించేలా డిండి, సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి 5.54 టీఎంసీలు తరలించడంతో పాటు తుమ్మిళ్ల, భక్తరామదాస, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులను చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40, నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యాన్ని 22 నుంచి 25.4, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచే పనులను అనుమతి లేకుండా చేపట్టింది. మొత్తంగా8.93 టీఎంసీలను అనుమతి లేకుండానే తరలించడానికి తెలంగాణ సర్కార్‌ ప్రయత్నిస్తోందని.. వాటి వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని.. వాటిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు, కేంద్ర జల్‌ శక్తి శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 

ఇది ఏకపక్ష నిర్ణయమే..
అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టులను నిలిపి వేయాలని గతేడాది అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి ఆదేశించారు. అయినప్పటికీ తెలంగాణ సర్కార్‌ పనులు యథేచ్ఛగా చేస్తుండటంపై ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తోంది. వాటిపై బోర్డు చైర్మన్‌ ఎ.పరమేశం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వాటా నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, చెన్నై తాగు నీటి అవసరాలు, రాయలసీమ సాగు నీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను మాత్రం ఈ నెల 19న పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలని బోర్డు చైర్మన్‌  ప్రతిపాదించారు. దీనిపై బుధవారం ఈఎన్‌సీ నారాయణ రెడ్డి స్పందించారు. బోర్డు పరిధిని కేంద్రం ఇప్పటిదాకా ఖరారు చేయలేదని, ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతలను ఎలా పరిశీలిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులను తనిఖీ చేయకుండా రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు ఏర్పాట్లు చేయాలని కోరడం పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని.. ఆ వైఖరిని విడనాడాలని హితవు పలికారు.   

మరిన్ని వార్తలు