రఘురామ వైద్యపరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్‌ అధికారి

18 May, 2021 11:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నరసపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్‌ అధికారిని తెలంగాణ హైకోర్టు  నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ నాగార్జునను హైకోర్టు  నియమించింది. ఈ మేరకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి జ్యుడిషియల్‌ అధికారి చేరుకున్నారు. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకృష్ణరాజుకు ముగ్గురు ఆర్మీ వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ  వైద్య పరీక్షలను అధికారులు వీడియో తీస్తున్నారు. మెడికల్‌ నివేదికను సీల్డ్‌ కవర్‌లో  న్యాయాధికారి సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు.

కాగా  రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిలు ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తనకు రమేశ్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ఆయన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చి.. రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్‌ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ద్వారా సీల్డ్‌ కవర్‌లో తమకు నివేదిక పంపాలని పేర్కొంది. దీనిపై ఈనెల 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు