మార్గదర్శికి తెలంగాణ హైకోర్టు ఝలక్!

14 Mar, 2023 03:15 IST|Sakshi

 మార్గదర్శిని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

ఏపీలో హైకోర్టు ఉంది కదా..?

కేసులు, దర్యాప్తు అంతా అక్కడే.. 

అలాంటప్పుడు వీటిని విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందా?

దీనిపై తేలకుండా దర్యాప్తులో జోక్యం చేసుకోలేం

విచారణ ఈ నెల 20వతేదీకి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఉంది కదా..? మరి ఇక్కడెందుకీ పిటిషన్‌ దాఖలు చేశారు..?’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ యాజమాన్యాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. కేసులు ఏపీలో నమోదయ్యాయి.. విచారణ అధికారులూ ఏపీ వారే.. బ్రాంచ్‌లు ఉన్నది కూడా అక్కడే.. అలాంటప్పుడు ఈ పిటిషన్‌పై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు ఉందా? అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై తేలకుండా దర్యాప్తులో తాము జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. 

ఏదేమైనా విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నామని, ఆలోగా పరిధిపై నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మార్గదర్శిపై ఏపీలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా అరెస్టు సహా బలవంతపు చర్యలు చేపట్టకుండా, హైదరాబాద్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, చెరుకూరి రామోజీరావు, శైలజ తరపున లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ గోవిందరెడ్డి, మార్గదర్శి తరఫున న్యాయవాది దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపించారు.

అక్కడి కేసులపై.. ఇక్కడ విచారణా?
‘409, 477(ఏ), 420 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ 10 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసులే. కాగ్నిజబుల్‌ నేరాల కిందికే వస్తాయి. ఏపీలో నమోదైన కేసులపై ఇక్కడ ఉపశమనం కోరలేరు. ఈ కోర్టుకు అక్కడి కేసులపై విచారణ జరిపే పరిధి లేదు. గతంలో పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణలోని మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే అప్పటికే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను, రిజిస్టర్లను పరిశీలించగా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కేసులు నమోదు చేశారు. అక్రమాలు నిగ్గు తేలినప్పటికీ కేసులు నమోదు చేయవద్దని, ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో ఆదేశించలేదు. 

చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. మొత్తం బ్రాంచ్‌లకు వారే బాధ్యులు. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును మ్యూచువల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లలోకి అక్రమంగా మళ్లిస్తున్నారు. చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నారు. ఒకటి రెండు అంశాల్లో మినహా ఏపీ హైకోర్టు పరిధిలోని విషయాలపై తెలంగాణ హైకోర్టు కలుగజేసుకునే అవకాశం లేదు. ఇది ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా ఏపీకి హైకోర్టు ఏర్పాటైన తర్వాత తెలంగాణ హైకోర్టుకు అక్కడి అంశాలపై పరిధి ఉండదని చట్టం చెబుతోంది. 

ఒక్క డెట్‌ రిలీఫ్‌ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ)కి సంబంధించి డీఆర్‌టీ–2 రాయలసీమ పరిధి వరకు జోక్యం చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. కేసులు నమోదు చేసిన నేరాలన్నీ ఏపీలోనే జరిగాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసులూ అక్కడి వారే. అలాంటప్పుడు అరెస్టులు చేయవద్దని ఇక్కడ కోరడం చట్ట విరుద్ధం. అసలు అలా పిటిషనే వేయలేరు. హైకోర్టుల పరిధికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టంగా పేర్కొంది. ఏపీ హైకోర్టు పరిధిలో కలుగజేసుకోలేమని ఇదే హైకోర్టు పలు తీర్పులను ఇచ్చింది. నిందితులు ఏ రాష్ట్రంలో ఉన్నా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అది వారికున్న చట్టబద్ధమైన అధికారం. ఏపీలో హత్య చేసి వచ్చి తెలంగాణలో దాక్కుని అరెస్టు చేయవద్దని ఇక్కడి కోర్టును కోరడం ఎలా చట్టవిరుద్ధమో.. ఇదీ అంతే’ అని గోవిందరెడ్డి నివేదించారు. ‘‘పోలీసులు హైదరాబాద్‌ వస్తున్నారా?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రాథమికంగా నేరం జరిగింది.. అక్రమాలు జరిగాయని నిరూపణ అయితే అరెస్టు చేయవచ్చని గోవిందరెడ్డి నివేదించారు. ఇదో భారీ వైట్‌ కాలర్‌ నేరమన్నారు.

ముందుగా ‘పరిధి’ తేలుద్దాం..
‘ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినా తనిఖీలు చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజ పేర్లు చేర్చారు. మార్గదర్శి చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ తెలంగాణలో నివసించడం, తెలంగాణలోని బ్రాంచ్‌ల్లోనూ తనిఖీలు చేసే అవకాశం ఉన్నందున ఈ హైకోర్టులో పిటిషన్‌ వేశాం. ఏపీలో పలు బ్రాంచ్‌ మేనేజర్లను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. తనిఖీలపై స్టే విధిస్తూ ఇదే కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు తనిఖీలు చేపడితే అది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది’ అని మార్గదర్శి తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు. 

ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మిగతా అంశాల జోలికి ఇప్పుడు వెళ్లకుండా అసలు ఈ కోర్టుకు పరిధి ఉందా? లేదా? అన్న విషయాన్ని ముందుగా తేలుద్దామని స్పష్టం చేశారు. ­తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది రూపేందర్‌ వాదనలు వినిపించారు. తెలంగాణ డీజీపీని ప్రతివాదిగా చేర్చారని, అసలు ఈ పిటిషన్‌ విచారణార్హం కాదన్నారు. వచ్చే సోమవారం వరకు పిటిషనర్లపై అరెస్టులు లాంటి చర్యలు తీసుకోబోమని గోవిందరెడ్డి తెలియచేయడంతో న్యాయ మూర్తి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు