జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు 

28 Sep, 2022 03:36 IST|Sakshi

1,416 ఎకరాలను జప్తు నుంచి విడుదల చేయాలని ఈడీకి ఆదేశం 

భూముల విడుదలకు ప్రత్యేక కోర్టుకు వెళ్లాలన్న ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు సరికాదు 

తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం తీర్పు 

11,804 ఎకరాల జప్తు వ్యవహారంలో విచారణ నవంబర్‌ 14కి వాయిదా 

సాక్షి, అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాడరేవు నిజాంపట్నం పోర్ట్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌ (వాన్‌పిక్‌) కోసం సేకరించిన 1,416.91 ఎకరాల పట్టా భూమిని జప్తు నుంచి వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని ఆదేశించింది. వాన్‌పిక్‌ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 561.19 ఎకరాలు, వాన్‌పిక్‌ ప్రాజెక్స్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌కు చెందిన 855.71 ఎకరాల భూమిని జప్తు నుంచి విడుదల చేయాలని ఈడీకి తేల్చిచెప్పింది.  

1,416.19 ఎకరాల భూమిని జప్తు చేస్తూ ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను, వాటిని సమర్థిస్తూ ఈడీ అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ ఉత్తర్వులను తప్పుబడుతూ అప్పిలెట్‌ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అయితే వాన్‌పిక్‌ భూముల జప్తును కొనసాగిస్తూ, జప్తు విడుదల కోసం మనీ లాండరింగ్‌ నిరోధక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సూచిస్తూ అప్పిలెట్‌ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తప్పుపట్టింది.

ఒకవైపు ఈడీ, అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులు చట్ట విరుద్ధమంటూ మరోవైపు  ఆస్తుల జప్తు కొనసాగిస్తూ విడుదల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని అప్పిలెట్‌ అథారిటీ పేర్కొనడం ఘోర తప్పదని హైకోర్టు వ్యాఖ్యానించింది.  ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నంద ధర్మాసనం తీర్పునిచ్చింది. 

ఇదీ నేపథ్యం... 
వాడరేవు నిజాంపట్నం పోర్ట్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌ (వాన్‌పిక్‌) ఏర్పాటు నిమిత్తం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభు త్వం ప్రకాశం–గుంటూరు జిల్లాల పరిధిలో 13,221.69 ఎకరాల భూములను కేటాయించింది. వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ విషయంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశాల్లో ఒకటైన రస్‌ అల్‌ ఖైమాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు అమలుకు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వాన్‌పిక్‌ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)గా ఏర్పాటయ్యాయి.

అయితే వైఎస్‌ జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకుగాను క్విడ్‌ ప్రో కోలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకు ఈ కేటాయింపులు జరిగాయంటూ సీబీఐ ఆరోపించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. అటు తరువాత వాన్‌పిక్‌కు భూ కేటాయింపులపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ ఆధారంగా ‘వాన్‌పిక్‌ ’కు చెందిన 1,416.91 ఎకరాల భూమిని జప్తు చేస్తూ ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై వాన్‌పిక్‌ పోర్ట్స్, వాన్‌పిక్‌ ప్రాజెక్స్‌.. అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. ఇవి పెండింగ్‌లో ఉండగానే 11,804.78 ఎకరాల అసైన్డ్‌ భూమిని జప్తు చేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో 13,221.69 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ సమర్థించింది. 

క్విడ్‌ ప్రో కో అన్నదే లేదు.. 
దీనిపై ‘వాన్‌పిక్‌’ కంపెనీలు అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ట్రిబ్యు నల్‌ విచారణ జరిపి 2019 జూలైలో తీర్పు వెలువరించింది. ఈడీ, అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను తప్పుబట్టింది. ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే భూముల జప్తును మాత్రం కొనసాగిస్తూ వాటి విడుదల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ సూచించింది. 

ట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీళ్లు... 
దీనిపై వాన్‌పిక్‌ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వాన్‌పిక్‌ ప్రాజెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు హైకోర్టులో వేర్వేరుగా మూడు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌  భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాన్‌పిక్‌ తరఫున సీని యర్‌ న్యాయవాది అతుల్‌ నంద, ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. 561 ఎకరాలు, 855 ఎక రాల జప్తు విషయంలో దాఖలైన వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించింది. 11,804 ఎకరాల జప్తు వ్యాజ్యంలో మరిన్ని అంశాలపై వాదనలు వినాల్సి ఉందని, విచారణను నవంబర్‌ 14కి వాయిదా వేసింది.

ప్రత్యేక కోర్టు ఉత్తర్వులివ్వకుండా భౌతిక స్వాధీనం చెల్లదు.. 
చట్ట నిబంధనలు ఫలానా విధంగా వ్యవహరించాలని చెబుతున్నప్పుడు దాని ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేయడానికి ముందే భూములను ఈడీ భౌతికంగా స్వాధీనం చేసుకోవడం తగదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపింది. జప్తు నుంచి భూముల విడుదలకు ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని, ఆ కోర్టు ఉత్తర్వులిచ్చే వరకు జప్తు కొనసా గుతుందని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వు లు ఏ కోణంలో చూసినా సరికాదని తేల్చిచెప్పింది.

అందువల్ల ట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై వాన్‌పిక్‌ కంపెనీలు దాఖలు చేసిన ఈ అప్పీళ్లను అనుమతించేందుకు సంకోచించడం లేదంది. జప్తు చేసిన 1,416.19 ఎకరాలను విడుదలచేయాలని ఈడీని ఆదేశించింది. ఇదిలాఉండగా వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు ఇటీవల కొట్టిసిన విషయం తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు