చెప్పుడు మాటలతో దర్యాప్తా?

1 Jun, 2023 02:32 IST|Sakshi

ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలేవి?  

రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నారు... ఇంకా ఆరోపణలేనా?

సీబీఐ దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు ప్రశ్నల వర్షం 

ఎవరో ఏదో అనుకుంటున్నారని... అదే సాక్ష్యమంటే ఎలా? 

అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఏం చెప్పారో.. అదే దర్యాప్తా? 

మీ దర్యాప్తు మొత్తం సాక్షుల స్టేట్‌మెంట్లతోనే జరుగుతోంది!  

హత్య వెనక రాజకీయ కోణం ఉందనటానికి ఆధారాలేవి? 

అవినాశ్‌ పాత్ర ఉందంటూ... రెండేళ్లుగా ఎందుకు విచారించలేదు? 

హంతకుడు వాడిన గొడ్డలిని రికవరీ చేయలేదెందుకు? 

నిందితులకు ఇచ్చిన డబ్బుల్ని కూడా రికవరీ చేయలేదుగా? 

దస్తగిరి అనుచరుడు మున్నాను విచారించలేదెందుకు? 

ఎర్ర గంగిరెడ్డితో మిగతా ముగ్గురికీ ఎలాంటి సంబంధాలున్నాయి? 

వాటిపై మీ దర్యాప్తులో ఎందుకు దృష్టిపెట్టలేదు? 

సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్‌ పాత్ర ఉందని ఎలా చెబుతారు? 

ఆయన విచారణకు హాజరవుతూనే ఉన్నారుగా? కస్టడీ ఎందుకు? 

అవినాశ్‌ రెడ్డి కస్టోడియల్‌ విచారణ అవసరం లేదని స్పష్టీకరణ 

షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు 

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు మినహా ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరో అన్నవి, విన్నవి మినహా సాక్ష్యాలేవని ప్రశ్నించింది. కేవలం చెప్పుడు మాటలు, ఊహాజనిత సాక్ష్యాల ఆధారంగా సీబీఐ తప్పుదారిలో దర్యాప్తు కొనసాగిస్తోందని తప్పుబట్టింది.

ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి కస్టోడియల్‌ విచారణ అవసరం లేదని పేర్కొంటూ ఐదు షరతులతో ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, జూన్‌ చివరి వరకు దర్యాప్తునకు సహకరించాలని, ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరు కావాలని తెలిపింది.

ఒకవేళ అవినాశ్‌ను అరెస్టు చేస్తే రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరి ష్యూరిటీ తీసుకుని బెయిల్‌పై విడుదల చేయాలని కూడా సీబీఐని ఆదేశించింది. షరతులను అవినాశ్‌ ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.

ముందస్తు బెయిల్‌ కోరుతూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్ర, శనివారం సుదీర్ఘ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు మే 31న తుది తీర్పు వెలువరిస్తామని, అప్పటివరకు ఆయన్నుఅరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అవినాశ్‌రెడ్డికి షరతులతో ముందుస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.  
 
సాక్షులెవరూ ఫిర్యాదు చేయలేదు.. 

‘సుదీర్ఘ కాలం దర్యాప్తు చేసినా అవినాశ్‌కు వ్యతిరేకంగా సీబీఐ ఎలాంటి ఆధారాలను  సేకరించలేకపోయింది. కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను చెరిపివేయడంలోనూ అవినాశ్‌ ప్రమేయం ఉన్నట్లు తేలలేదు. సాక్షులను అవినాశ్‌ బెదిరిస్తున్నట్లు ఇప్పటివరకు ఎవరూ దర్యాప్తు అధికారులకు ఫిర్యాదు చేయలేదు.

సీబీఐ సేకరించింది హియర్‌ సే ఎవిడెన్స్‌ (ఫలానా వ్యక్తి నాకు చెప్పారు అని మరొకరి చెప్పడం), ఊహాజనిత సాక్ష్యాలు మాత్రమే. ఈ హత్య వెనుక భారీ కుట్ర ఉందనేందుకు అవినాశ్‌కు వ్యతిరేకంగా నేరుగా ఒక్క ఆధారం కూడా లేదు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన సమాచారంపైనే సీబీఐ పూర్తిగా ఆధారపడి దర్యాప్తు సాగిస్తోంది. రాజకీయ కోణం అంటున్నా అందుకు ఆధారాలు లేవు. కోర్టుకు ఆరోపణలు కాదు.. ఆధారాలు కావాలి.

ఈ అంశాలన్నింటిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత కస్టోడియల్‌ విచారణ అవసరం లేదని ఈ కోర్టు భావిస్తోంది. అవినాశ్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు పిటిషన్‌ను అనుమతిస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ‘సాక్షుల స్టేట్‌మెంట్లతోనే సీబీఐ దర్యాప్తు చేసింది. రెండేళ్ల క్రితమే అవినాశ్‌ కుట్ర బయటపడిందని చెప్పిన సీబీఐ అప్పుడే ఎందుకు విచారణ చేయలేదో సమాధానం లేదు. హత్యకు వాడిన గొడ్డలిని సీబీఐ రికవరీ చేయలేదు. ఏ–2 గొడ్డలిని నాలాలో పడేసినట్లు చెప్పాడు. నిందితులకు ఇచ్చిన డబ్బును కూడా రికవరీ చేయలేదు.

దస్తగిరి అనుచరుడు మున్నాను ఈ డబ్బుకు సంబంధించి విచారించలేదు. వివేకా అల్లుడు తానే లేఖను దాచిపెట్టానని వాంగ్మూలంలో చెప్పాడు. ఎర్రగంగిరెడ్డితో మిగతా ముగ్గురు నిందితులకు ఉన్న సంబంధాలను సీబీఐ కనుగొనలేదు. వివేకా తలపై గాయాలున్నా హత్య కేసుగా నమోదు కాలేదు. అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేయడం నాటి విచారణాధికారి తప్పిదమే. కడప ఎంపీ టికెట్‌ వివాదంపై సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవు. వివేకా హత్య కేసులో, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్‌ పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవు’ అని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. 
 
ఎక్కడా అవినాశ్‌ పాత్ర లేదు: న్యాయవాది 
‘ఈ హత్య కేసు వెనుక భారీ కుట్ర ఉందంటున్న సీబీఐ, అవినాశ్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. విచారణకు అవినాశ్‌ సహకరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఏడు సార్లు విచారణ జరిగింది. హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా సీబీఐ ఆరోపణలు మినహా అవినాశ్‌కు వ్యతిరేకంగా ఆధారాలను చూపడం లేదు.

సాక్ష్యాలు లేకుండా ఓ పార్లమెంట్‌ సభ్యుడి ప్రజా జీవితాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు అవినాశ్‌ అక్కడకు చేరుకునేటప్పటికి అందరూ గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారని చెబుతుండటంతో ఆయన కూడా తొలుత అలాగే భావించారు. సాక్ష్యాల ధ్వంసంలోనూ ఆయన పాత్ర లేదు. అప్పటికే పలు ఫోన్లలో వీడియోలు, ఫొటోలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు విచారించిన నేపథ్యంలో కస్టోడియల్‌ విచారణ అవసరం లేదు’ అని అవినాశ్‌ న్యాయవాది పేర్కొన్నారు. 
 
బెయిల్‌ మంజూరుకు కోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలివీ.. 
తొలి చార్జీషీట్‌ సమయంలో అవినాశ్‌కు సంబంధం ఉండొచ్చని అనుమానించిన సీబీఐ విచారణ నోటీసులు జారీ చేసేందుకు మాత్రం రెండేళ్లు ఆగింది. జనవరి నుంచి విచారణకు హాజరు కావాలని మాత్రమే నోటీసులు జారీ చేసింది. ఒకవేళ ఆయన్ను అరెస్టు చేసే ఉద్దేశం ఉంటే సీబీఐ ఇన్నేళ్లు ఎందుకు ఆగిందనే దానికి దర్యాప్తు అధికారుల వద్ద సమాధానం లేదు. అవినాశ్‌ తల్లి మెడికల్‌ రికార్డులను  పరిశీలిస్తే శస్త్రచికిత్స వాస్తవమే అన్నది తెలుస్తోంది. విచారణ సందర్భంగా హైకోర్టు అడిగిన పలు ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పలేకపోయింది.    

మరిన్ని వార్తలు