KRMB: అడ్డం తిరిగిన తెలంగాణ 

6 Dec, 2022 19:08 IST|Sakshi

శ్రీశైలం రూల్‌కర్వ్స్‌పై శనివారం అంగీకారం.. సోమవారం యూటర్న్‌

తుది నివేదికపై సంతకాలు చేసే సమావేశానికి గైర్హాజరు

నివేదికపై సంతకం చేసిన ఆర్‌ఎంసీ కన్వీనర్, బోర్డు సభ్యుడు, ఏపీ అధికారులు

మార్పులను వ్యతిరేకించామంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

కృష్ణా బోర్డు చైర్మన్‌కు తుది నివేదిక ఇచ్చిన ఆర్‌ఎంసీ కన్వీనర్‌

ఈ నివేదికపై బోర్డు సర్వ సభ్య సమావేశంలో నిర్ణయం 

సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం నిర్వహణ విధానాల్లో (రూల్‌ కర్వ్స్‌) స్వల్ప మార్పులకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు అంగీకరించిన తెలంగాణ.. తుది నివేదికపై సంతకం పెట్టే సమయంలో అడ్డం తిరిగింది. హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, జెన్‌కో సీఈ సుజయ్‌కుమార్‌ హాజరైనా.. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, జెన్‌కో డైరెక్టర్‌ వెంకటరాజం గైర్హాజరయ్యారు. దాంతో తుది నివేదికపై ఆర్‌ఎంసీ కన్వీనర్‌ ఆర్కే పిళ్‌లై, బోర్డు సభ్యుడు (విద్యుత్‌) మౌతాంగ్, ఏపీ ఈఎన్‌సీ, జెన్‌కో సీఈ సంతకాలు చేశారు. తొలుత అంగీకారం తెలిపిన తెలంగాణ అధికారులు.. ఆ తర్వాత సంతకాలు చేయడానికి గైర్హాజరైనట్లు పేర్కొంటూ ఆర్‌ఎంసీ కన్వీనర్‌ పిళ్లై కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌కు తుది నివేదికను అందజేశారు.

ఈ నివేదికపై కృష్ణా బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీ. ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఆర్‌ఎంసీ సమావేశంలో శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్స్‌లో స్వల్ప మార్పులకు తాము సమ్మతించకపోయినా, అంగీకరించినట్లుగా కన్వీనర్‌ పిళ్‌లై తప్పుగా చిత్రీకరించారంటూ కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం సాయంత్రం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంపిణీకి తాము అంగీకరించబోమని, 50:50 నిష్పత్తిలో పంపిణీ చేయాలంటూ ఆ లేఖలో పాత పల్లవి అందుకున్నారు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగా శ్రీశైలం, సాగర్‌ల రూల్‌కర్వ్స్‌ ముసాయిదా, విద్యుత్‌ ఉత్పత్తి, మళ్లించిన వరద జలాలను కోటాలో కలాపాలా వద్దా అనే అంశాలపై చర్చించడానికి నాలుగుసార్లు ఆర్‌ఎంసీ సమావేశాలు నిర్వహించారు. ఒకట్రెండు సమావేశాలకు మాత్రమే తెలంగాణ అధికారులు హాజరయ్యారు. శనివారం జరిగిన ఐదో సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం రూల్‌కర్వ్స్‌లో స్వల్ప మార్పులకు ఇరు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. సాగర్‌ రూల్‌కర్వ్స్‌పై సీడబ్ల్యూసీ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

చదవండి: (ఏబీఎన్‌ వెంకటకృష్ణను విచారించిన సీఐడీ)

శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగా ఉంచాలన్న సీడబ్ల్యూసీ ప్రతిపాదనకు అంగీకరించారు. శ్రీశైలంలో 50 : 50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తి చేయాలని, సాగు, తాగునీటికి బోర్డు కేటాయించిన నీటితోనే విద్యుదుత్పత్తి చేయడానికి సమ్మతించారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కడలిలో వరద జలాలు కలుస్తున్నప్పుడు రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటాలో కలపకూడదన్న ఏపీ ప్రతిపాదనకు అంగీకరించారు. అయితే, ఇదే అంశాలతో కూడిన తుది నివేదికపై సంతకం చేయడానికి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు.

ఇదీ నివేదిక
శ్రీశైలం రూల్‌ కర్వ్స్‌లో స్వల్ప మార్పులు, 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తి, మళ్లించిన వరద జలాలను లెక్కించినా కోటాలో కలపకూడదంటూ పేర్కొన్న తుది నివేదికపై తెలంగాణ మినహా ఆర్‌ఎంసీ సభ్యులు సంతకాలు చేశారు. శ్రీశైలం, సాగర్‌ల నిర్వహణకు శాశ్వత జలాశయాల నిర్వహణ కమిటీ (పీఆర్‌ఎంసీ)ని ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. కృష్ణా బోర్డు కేటాయించిన నీటి వినియోగంపై ప్రతి పది రోజులకు ఒక సారి పీఆర్‌ఎంసీ సమావేశమై, లోటుపాట్లు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దడానికి బోర్డుకు సూచనలు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు