ఏపీలో సంక్షేమ పథకాలు భేష్‌

15 Jun, 2021 06:01 IST|Sakshi
షేర్‌మహ్మద్‌పేట హైస్కూల్‌లో నాడు–నేడు పనులను పరిశీలిస్తున్న తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ శ్రీదేవసేన, చిత్రంలో ఏపీ ప్రభుత్వ విప్‌ ఉదయభాను తదితరులు

తెలంగాణ ఉన్నతాధికారుల బృందం ప్రశంస

జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ మండలాల్లోని పాఠశాలల్లో నాడు–నేడు పనుల పరిశీలన

షేర్‌మహ్మద్‌పేట (జగ్గయ్యపేట అర్బన్‌) /మక్కపేట (వత్సవాయి) /నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బృందం ప్రశంసించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు–నేడు పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఎ.శ్రీదేవసేన నేతృత్వంలో 17 మంది ఉన్నతాధికారుల బృందం సోమవారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ మండలాల్లో పర్యటించింది. ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆ బృందం జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటలోని జెడ్పీ హైస్కూల్‌లో నాడు–నేడు పనులను పరిశీలించింది.

ఈ పనులు చేపట్టిన విధానం, పనుల నిర్వహణ, నిధుల వినియోగం తదితర అంశాల గురించి స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు రమణను, విద్యాకమిటీ చైర్మన్, సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో 5 రోజులు 5 రకాల మెనూ అమలు చేస్తున్నట్లు హెచ్‌ఎం వివరించగా.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవసేన మాట్లాడుతూ తెలంగాణలో మనబడి నాడు–నేడు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు పనుల్లో నాణ్యత ప్రమాణాలు, పారదర్శకత, స్కూల్‌ కమిటీల భాగస్వామ్యం పరిశీలించామని, స్కూల్‌లోని మౌలిక సదుపాయాలు బావున్నాయని, పనులు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.

ప్రభుత్వ విప్‌ ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్రంలో 45,329 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నాణ్యమైన విద్యను అందించేందుకు 3 దశల్లో ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ రూపకల్పన చేశారని చెప్పారు. అనంతరం వత్సవాయి మండలం మక్కపేటలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనులను ఈ బృందం పరిశీలించింది. జగనన్న విద్యాకిట్ల గురించి వాకబు చేసి కిట్‌లో ఉన్న వస్తువులను బృందం సభ్యులు పరిశీలించారు. నందిగామ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు–నేడు పనులను కూడా పరిశీలించారు. బృందంలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారి మకందర్, పాఠశాల సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ ఎండీ పార్థసారథి తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు