వైఎస్సార్‌ ఆర్బీకేల సేవలు భేష్‌

27 Feb, 2022 05:10 IST|Sakshi
కృష్ణా జిల్లా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ పనితీరును అడిగి తెలుసుకుంటున్న తెలంగాణ వ్యవసాయ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంత్‌ తదితరులు

ఆంధ్రప్రదేశ్‌ తరహాలో తెలంగాణలో రైతు సేవలు

ఆర్బీకే, అగ్రి ల్యాబ్, కాల్‌ సెంటర్‌ను పరిశీలించిన తెలంగాణ బృందం

గ్రామస్థాయికి రైతు సేవలందించేలా కసరత్తు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలంగాణ వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంత్‌ అన్నారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా నాణ్యమైన సేవలందించడం  గొప్ప విషయమన్నారు. ఇదే తరహాలో తమ రాష్ట్రంలోనూ రైతులకు అందిస్తున్న సేవలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తున్న దన్నారు. స్పెషల్‌ కమిషనర్‌ హనుమంత్‌ నాయకత్వంలోని తెలంగాణా వ్యవసాయ శాఖ అధికారుల బృందం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు ఆర్బీకే కేంద్రాన్ని శనివారం సందర్శించింది.

సిబ్బందివివరాలు, రైతులకు అందే సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేలో ఉన్న పురుగుల మందుల నాణ్యతను స్వయంగా టెస్ట్‌ కిట్‌పై పరీక్షించి చూశారు. కియోస్క్‌ పనితీరు, ప్రయోజనాలపై ఆరా తీశారు. అదేసమయంలో ఆర్బీకేకు వచ్చిన రాజారావు అనే రైతు కియోస్క్‌ ద్వారా ఎరువులు బుక్‌ చేసుకున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఆర్బీకే ప్రొక్యూర్‌మెంట్‌ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. డిజిటల్‌ లైబ్రరీలో ఉన్న రైతు భరోసా తదితర మేగజైన్స్‌ను పరిశీలించారు.

అనంతరం కంకిపాడు మార్కెట్‌ యార్డులోని ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ల్యాబ్‌ను సందర్శించారు. ఇక్కడ ఫిషరీస్‌ ల్యాబ్‌తో పాటు అత్యాధునిక పరికరాల పని తీరును పరిశీలించారు. అక్కడ నుంచి నేరుగా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ పనితీరు అడిగి తెలుసుకున్నారు. కాల్‌ సెంటర్‌లో నిర్వహిస్తోన్న ఆర్బీకే చానల్‌ ద్వారా ఉద్యాన శాస్త్రవేత్త రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్న తీరును పరిశీలించారు.

వచ్చిన అధికారుల్లో ఒకరు బయటకు వెళ్లి ఓ రైతు మాదిరిగా కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేసి తమకున్న సందే హాన్ని అడుగగా దానికి ఆ శాస్త్రవేత్త చెప్పిన సమాధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ అనుబంధ విభాగాల  పనితీరును రాష్ట్ర జేడీఏ శ్రీధర్‌ వారికి వివరించారు. తమ రాష్ట్రంలోనూ ఓ ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఛానల్‌ ప్రారంభించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని,  కమిషనర్‌ హనుమంత్‌ తెలిపారు.  తెలంగాణ వ్యవసాయ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌–2 కె.విజయకుమార్, రైతు వేదిక ఏడీఏ అనిత, సీడ్స్, ఎరువుల జేడీఏ, డీడీఏలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు