నీరంతా సముద్రం పాలు.. ఏమిటీ దారుణం..!

5 Jul, 2021 02:40 IST|Sakshi
నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్ల నుంచి దిగువనున్న పులిచింతలకు నీటి పరవళ్లు 

సాగర్, పులిచింతల్లోనూ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి

ప్రకాశం బ్యారేజీ నుంచి 8,400 క్యూసెక్కులు వృథాగా కడలిలోకి

పులిచింతల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి పెంచుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి పెరుగుతున్న ప్రవాహం

నేటి నుంచి ఒక టీఎంసీకిపైగా కడలిలోకి వదలాల్సిన దుస్థితి

సాక్షి, అమరావతి: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయినప్పటికీ.. తెలంగాణ సర్కార్‌ ఎడమగట్టు కేంద్రం ద్వారా యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ 38.72 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోయింది. నాగార్జునసాగర్, పులిచింతల్లోనూ యథేచ్చగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్టు 20 గేట్లు అరడుగు మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం 8,400 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు.

పులిచింతలలో ఆదివారం విద్యుదుత్పత్తిని తెలంగాణ సర్కార్‌ పెంచడంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం పెరుగుతోంది. సోమవారం ఉదయం ఒక టీఎంసీ నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఈఈ స్వరూప్‌ తెలిపారు. తెలంగాణ సర్కార్‌ చర్యల వల్ల భవిష్యత్‌లో రెండు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ముప్పు పొంచి ఉందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. కానీ.. తెలంగాణ సర్కార్‌ ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 20,130 క్యూసెక్కులను వదిలేస్తోంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం 817.09 అడుగులకు పడిపోయింది. మొత్తం 215.81 టీఎంసీల సామర్థ్యంగల ఈ జలాశయంలో నీటినిల్వ 38.72 టీఎంసీలకు తగ్గింది. నీటినిల్వ డెడ్‌స్టోరేజీకి పడిపోయింది.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద తెలంగాణ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్‌ జలాశయానికి 21,973 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా 31,223 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 30,723 క్యూసెక్కుల వినియోగంతో విద్యుదుత్పాదన కొనసాగుతోంది. దీంతో సాగర్‌లో నీటిమట్టం 532.2 అడుగులకు పడిపోయింది. మొత్తం 312.04 టీఎంసీల సామర్థ్యంగల ఈ జలాశయంలో నీటినిల్వ 174.46 టీఎంసీలకు తగ్గిపోయింది. పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం వల్ల నీటినిల్వ 29.52 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తిని పెంచుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం పెరుగుతోంది.

కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ పంటలకు రైతులు సంసిద్ధంగా లేకపోవడంతో బ్యారేజీ నుంచి 8,400 క్యూసెక్కులను అధికారులు వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో రెండు యూనిట్ల ద్వారా 46.4 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ణ, ఏఈ బి.కాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.   

మరిన్ని వార్తలు