తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం

28 Aug, 2021 13:13 IST|Sakshi

భాషా వికాసానికి సీఎం జగన్‌ కృషి  విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

సాక్షి, ఏఎన్‌యూ: తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఏర్పాటుకు ఆ పాలకులు ఎందుకు చొరవ తీసుకోలేదో చెప్పాలన్నారు. మాతృభాషా వికాసానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు.

చదవండి: సీఎం జగన్‌ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఏపీ గవర్నర్‌

ప్రస్తుతం ఉన్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అదే తరుణంలో తెలుగు సబ్జెక్టును కార్పొరేట్‌ పాఠశాలల్లో కూడా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. తెలుగు భాషపై లోతైన అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. తెలుగు కవుల గొప్పతనాన్ని తెలియజేస్తూ నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీకి తిక్కన విక్రమ సింహపురి యూనివర్సిటీగా పేరు మార్చుతూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నామని తెలిపారు. గిడుగు రామ్మూర్తి జీవిత చరిత్ర చిత్రాలతో పోస్టల్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్‌ కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. తెలుగు, సంస్కృత భాష వికాసానికి కృషి చేస్తున్న 13 మందికి మంత్రి చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు.  తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.కరుణ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్‌

మరిన్ని వార్తలు