జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం

9 Sep, 2020 05:09 IST|Sakshi
జయప్రకాష్‌రెడ్డి భౌతికకాయం వద్ద విలపిస్తున్న భార్య రాజ్యలక్ష్మి

గుంటూరులోని ఆయన నివాసంలో కన్నుమూత

తెల్లవారుజామున గుండెపోటుతో అక్కడికక్కడే తుదిశ్వాస

పలువురు ప్రముఖులు, అభిమానుల ఘన నివాళి

అశ్రునయనాలతో తుదివీడ్కోలు

3 భాషల్లో 340కి పైగా సినిమాల్లో నటన

మూడువేలకు పైగా నాటకాల్లో కూడా..

రాయలసీమ యాసతో ఎనలేని గుర్తింపు

ప్రధాని మోదీ, గవర్నర్‌ విశ్వభూషణ్, సీఎం జగన్‌ సంతాపం

గుంటూరు ఈస్ట్‌ /సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: సుప్రసిద్ధ విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి (74) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుంటూరు విద్యానగర్‌లోని ఆయన నివాసంలో బాతురూమ్‌కు వెళ్లగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు చంద్రప్రకాష్‌రెడ్డి, కుమార్తె మల్లిక ఉన్నారు. జయప్రకాష్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోదరులు, ఇతర బంధువులంతా అమెరికాలో ఉన్నారు. కొడుకు, కోడలు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండడంతో పీపీఈ కిట్లు ధరించి భౌతికకాయం వద్దకు వచ్చారు. కొరిటెపాడులోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 

అభిమానుల కన్నీటి వీడ్కోలు
జయప్రకాష్‌రెడ్డికి ఆయన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. నటనా రంగాన్ని వేదికగా చేసుకుని సమాజాన్ని చైతన్యపరచడానికి నిరంతరం పోరాడిన ఆ యోధునికి పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్‌ ముస్తఫా, మద్దాళి గిరిధరరావు, కిలారి రోశయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.  జయప్రకాష్‌రెడ్డి మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు.

విలక్షణ నటుడుగా గుర్తింపు..
ప్రతి నాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, రంగస్థల దిగ్గజంగా దాదాపు ఆరు దశాబ్దాలపాటు నటనా రంగంలో అలుపెరగకుండా చేసిన కృషి ఆయనను నటనా రంగంలో లెజెండ్‌గా నిలిపింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 340 సినిమాలు, 3 వేల నాటకాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ యాసతో ఆయన నటనకు ఎనలేని గుర్తింపు వచ్చింది.

సినీ లోకానికి తీరనిలోటు
జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణంపై ప్రధాని సంతాపం
తెలుగు చలనచిత్ర విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. ‘జయప్రకాష్‌రెడ్డి తనదైన నటనా శైలితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఆయన మరణం సినిమా ప్రపంచానికి తీరనిలోటు. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు కలిగిన శోకంలో నేను సైతం పాలుపంచుకుంటున్నాను’.. అని మంగళవారం ఒక ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు. అలాగే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా జయప్రకాష్‌రెడ్డి మరణంపట్ల విచారం వ్యక్తం చేశారు. 

గవర్నర్‌ విశ్వభూషణ్‌ విచారం
జయప్రకాష్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా ఒక ప్రకటనలో విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
ప్రఖ్యాత నటుడు జయప్రకాష్‌రెడ్డి మృతిపట్ల సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. తన హావభావాలు, డైలాగులు చెప్పే విధానంతో ఆయన సినీ పరిశ్రమలో సరికొత్త స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. జయప్రకాష్‌రెడ్డి మృతికి సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్‌పీపీ నేత వి. విజయసాయిరెడ్డి విచారం వ్యక్తంచేశారు. తెలుగు సినీ పరిశ్రమ, రంగస్థలం ఓ అద్భుతమైన నటుడిని కోల్పోయిందన్నారు. 

>
మరిన్ని వార్తలు