తెలుగుగంగ.. రికార్డు మురవంగ

20 Feb, 2023 05:23 IST|Sakshi
వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల చెరువు నుంచి బి.కోడూరు మండలంలోని చెరువులకు వెళుతున్న తెలుగుగంగ నీరు

సాక్షి, అమరావతి: తెలుగుగంగ ప్రాజెక్టు కింద ప్రస్తుత నీటి సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఐదు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు రాష్ట్ర ప్రభుత్వం నీటిని అందించింది. ప్రాజెక్టు చరిత్రలో ఈ స్థాయిలో నీళ్లందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తెలుగుగంగ లింక్‌ కెనాల్, ప్రధాన కాలువ లైనింగ్‌ పనులను రూ.460 కోట్లతో చేపట్టి దాదాపు పూర్తి చేయడంతోపాటు రూ.90 కోట్లతో డయాఫ్రమ్‌వాల్‌ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసింది. ఫలితంగా బ్రహ్మంసాగర్‌లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు రికార్డు స్థాయిలో నీళ్లందించగలిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  

నాడు వైఎస్సార్‌ కృషితో.. 
శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో తరలించే 29 టీఎంసీల కృష్ణా జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలను జతచేసి 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా దుర్భిక్ష ప్రాంతాలైన ఉమ్మడి కర్నూలు (1.08 లక్షల ఎకరాలు), వైఎస్సార్‌ కడప (1.67 లక్షల ఎకరాలు), నెల్లూరు (2.54 లక్షల ఎకరాలు), చిత్తూరు జిల్లా (46 వేల ఎకరాలు)ల్లో మొత్తం 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగు గంగ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. 2004 నుంచి 2009 మధ్య దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో అప్పట్లోనే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించగలిగారు.  

నిర్వహణపై టీడీపీ సర్కార్‌ నిర్లక్ష్యం 
బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలిగోడు రిజర్వా­య­ర్‌ వరకూ 7.80 కిలోమీటర్ల పొడవున 15 వేల క్యూ­సెక్కుల సామర్థ్యంతో తెలుగుగంగ లింక్‌ కెనాల్‌ను తవ్వారు. అయితే ఈ కాలువకు లైనింగ్‌ చేయకపోవడంవల్ల 2019 వరకు కేవలం 6 – 7 వేల క్యూ­సెక్కులు మాత్రమే తరలించారు. దీనివల్ల వెలిగో­డు రిజర్వాయర్‌ సకాలంలో నిండని దుస్థితి నెలకొంది.

ఇక వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్‌ వరకు 42.566 కి.మీల పొడవున ఐదు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తెలుగుగంగ ప్రధాన కాలువను తవ్వారు. దీనికి కూడా లైనింగ్‌ చేయకపోవడంతో 2,500 – 3,000 క్యూసెక్కులు కూడా తరలించలేని పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మంసాగర్‌ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీ (ఊట) ఏర్పడటంతో 17.745 టీఎంసీలకుగానూ కేవలం నాలుగైదు టీఎంసీలను మాత్రమే నిల్వచేసేవారు.

మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీలను (పిల్ల కాలువలు) పూర్తి చేయడం,  ప్రధాన కాలువ నిర్వహణను టీడీపీ సర్కార్‌ నిర్లక్ష్యం చేయడంతో ఐదేళ్లలో ఎన్నడూ రెండు మూడు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాల్లేవు. 

సీఎం జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనం 
తెలుగుగంగ లింక్‌  కెనాల్, ప్రధాన కాలు­వలకు లైనింగ్‌ చేయడం, డయాఫ్రమ్‌ వాల్‌­తో బ్రహ్మంసాగర్‌ లీకేజీలకు అడ్డకట్ట వేయ­డం వల్లే ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది ఐదు లక్షల ఎకరాలకుపైగా నీళ్లందించగలిగాం. సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పనులను పూర్తి చేయించారు. దీనివల్లే సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు నింపగలిగాం. తద్వారా గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించగలిగాం. 
– హరినారాయణరెడ్డి, సీఈ, తెలుగుగంగ 

యుద్ధప్రాతిపదికన లైనింగ్‌.. 
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్య­త­లు చేపట్టాక తెలుగుగంగ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలి­గో­డు రిజర్వాయర్‌ వరకు తెలుగుగంగ లింక్‌ కెనాల్‌ సా­మ­ర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచేలా లైనిం­గ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశా­రు. దీంతో 2020, 2021, 2022లో వెలిగోడును సకాలంలో నింపగలిగారు.

ఆయకట్టుకు నీళ్లందిస్తూ పంటలు పూర్తయ్యాక వెలిగోడు రిజర్వాయర్‌ నుంచి బ్రహ్మంసాగర్‌ వరకు తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్‌ పనులను చేపట్టి ఇప్పటికే 90% పూర్తి చేశారు. ఫలితంగా  ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం ఐదు వేల క్యూసెక్కులకు పెరిగింది.

బ్రహ్మంసాగర్‌ మట్టికట్టలో ఊటనీరు వచ్చే ప్రాంతంలో డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించి లీకేజీలకు గతేడాది అడ్డుకట్ట వేశారు. దీంతో 2021, 2022లో బ్రహ్మంసాగర్‌లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. కాలువల ప్రవాహ సామర్థ్యం పెంచి సోమశిల, కండలేరు జలాశయాలలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వచేయడానికి మార్గం సుగమం చేశారు.

ఈ ఏడాది వైఎస్సార్‌ కడప, కర్నూలు జిల్లాల్లో ఖరీఫ్‌.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో లేట్‌ ఖరీఫ్‌ కింద ఆయకట్టులో ఐదు లక్షల ఎకరాలకుపైగా నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. మిగతా డిస్ట్రిబ్యూటరీ పనులను వేగంగా పూర్తిచేసి మిగిలిన 75 వేల ఎకరాలకు కూడా నీళ్లందించే దిశగా అడుగులు వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు