Pallipattu Nagaraju: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..

25 Aug, 2022 15:59 IST|Sakshi

‘పల్లిపట్టు నాగరాజు’కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం

‘యాలై పూడ్సింది’ కవితా సంపుటికి అవార్డు

స్ఫూర్తినిచ్చిన శ్రీశ్రీ, తిలక్‌ రచనలు

వివక్ష, అణచివేత.. శ్రమజీవుల జీవనమే కవితావస్తువులు

జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం.. అడుగడుగునా కనిపించే వివక్ష నుంచి రగిలిన అగ్ని కణం.. కనుచూపు మేరలో కనిపించే అణచివేతను కూకటి వేళ్లతో పెకలించాలనే ఆక్రోశం.. పేదల పక్షాన పోరాటమై.. పీడిత జన పిడికిలై.. కవిత్వమే ఆయుధమై.. అక్షర సూరీడయ్యాడు.. నేను, నా కుటుంబం కాకుండా, మనం.. సమాజం అనుకొని ఎక్కుపెట్టిన ఆ కలం చైతన్య తూటాలను పేల్చింది.. నవ సమాజ నిర్మాణానికి తన వంతు బాధ్యతగా అక్షర యుద్ధం చేస్తున్న పల్లిపట్టు నాగరాజును కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా చరిత్రలో ఇదే తొలి పురస్కారం కావడం విశేషం. 


తిరుపతి కల్చరల్‌/శాంతిపురం:
నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన భూలక్ష్మి, రాఘవయ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు పల్లిపట్టు నాగరాజు పాఠశాల విద్యను వెంకటాపురంలో పూర్తి చేసి, సత్యవేడు జూనియర్‌ కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ(స్పెషల్‌ తెలుగు) చదివారు. కర్నూలు ఐఏఎస్‌ఈ కాలేజీలో తెలుగు పండిట్‌ శిక్షణ పొందారు. తిరుపతి ఎస్వీయూలో ఏంఏ తెలుగు ఉత్తీర్ణులై.. ప్రస్తుతం ఆచార్య మేడపల్లి రవికుమార్‌ పర్యవేక్షణలో విల్సన్‌ సుధాకర్‌ రచనలపై పీహెచ్‌డీ చేస్తున్నారు. 2016 జూన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శాంతిపురం మండలంలోని 64.పెద్దూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. 


చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి 

తల్లిదండ్రుల కష్టంతోపాటు చుట్టుపక్క ప్రజల జీవన శైలి నాగరాజు రచనలపై ఎనలేని ప్రభావం చూపింది. సమాజంలో సగటు మనిషి బాధలే తన బాధగా కవితలను అక్షరీకరించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో పీడిత జనానికి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలని అక్షరాలనే ఆయుధంగా మలుచుకున్నాడు. శ్రీశ్రీ, తిలక్‌ రచనల స్ఫూర్తితో తనదైన శైలిలో పల్లె భాషకు జీవం పోస్తూ సామాన్య పదాలతో అసామాన్య కవితలకు జీవం పోశాడు. 


అవ్వ చెప్పిన ఆ కథలే.. 

చిన్నప్పుడు అవ్వ మంగమ్మ చెప్పే జానపద కథలు, బుర్ర కథలు, దేవుళ్ల కథలు, దెయ్యాల కథలు, బూతు కథలు, నీతి కథలు, తమాషా కథలు.. నాగరాజు ఊహకు పదునుపెట్టాయి. బహుజనుల శ్రమతత్వం కవితకు ప్రేరణ కలిగించాయి. పాఠశాల స్థాయి నుంచే చిన్న చిన్న కవితలు, పాటలకు పేరడీలు రాసేందుకు సన్నద్ధం చేశాయి.  


ఏదో చేయాలని.. 

పోరాటంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కోణం. కొందరు తుపాకీ పడతారు, కొందరు శాంతి బాట పడతారు. ఇంకొకరు ఇంకొకటి.. ఇలా నాగరాజు ఎంచుకున్న బాట కవిత్వం. అక్షర శక్తి తెలిసిన వ్యక్తిగా పీడిత జనం పక్షాన నిలిచి అక్షర సేద్యం చేశారు. ఇలా రూపుదిద్దుకున్నదే ‘యాలైపూడ్సింది’. తొలి వచన కవితా సంపుటి 2021, జనవరి 31న కవి సంగమం ప్రచురణల ద్వారా తిరుపతిలో ఆవిష్కృతమైంది. 


ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది 

సామాన్య శ్రమజీవుల జీవన విధానాలను అక్షరాలుగా పేర్చి కూర్చిన తొలి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. తొలి రచనకే అనూహ్యంగా యువ పురస్కారం రావటం నా బాధ్యతను తెలియజేస్తోంది. సామాన్యుల కష్టాలు, వారి నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులే కథావస్తువులుగా రచనలు కొనసాగిస్తాం. ఇది నా తల్లిదండ్రుల శ్రమకు తగిన ఫలితం. శ్రమ జీవులు, బహుజనుల జీవితాల సంఘర్షణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. తల్లిదండ్రులకు ఈ అవార్డును అంకితమిస్తా.         
– పల్లిపట్టు నాగరాజు 

మరిన్ని వార్తలు