Shravana Masam 2022 Dates: అలరారే పండుగలు, సామూహిక వ్రతాలు.. ముఖ్యమైన తేదీలివే!

28 Jul, 2022 20:53 IST|Sakshi
పూజలందుకోనున్న సీతారాములు, లక్ష్మీ అమ్మవారు

అనంతపురం కల్చరల్‌: ఈనెల 28న వచ్చే అమావాస్య రాకతో ఆషాఢమాసం ముగిసి శుక్రవారం నుంచి నోములు, వ్రతాలకు నెలవైన శ్రావణం మాసం రానుంది. శుభకార్యాలు మళ్లీ మొదలు కానుండడంతో మాసమంతటా ప్రతి ఇంటా శ్రావణ శోభతో అలరారే పండుగలు, సామూహిక వ్రతాలు సందడి చేయనున్నాయి. శ్రావణంలో భక్తిశ్రద్ధలతో ఆచరించే ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మిక కోణమే కాకుండా సామాజిక, వైజ్ఞానిక అంశాలెన్నో దాగున్నాయని పెద్దలు చెబుతారు.

మానవ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శ్రావణ మాసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు ఉంటుంది. ఇప్పటికే శ్రావణమాస పూజల కోసం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. ఈనెల తప్పితే మళ్లీ డిసెంబరు వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో ఫంక్షన్‌ హాల్స్, కల్యాణమండపాలు బిజీగా మారనున్నాయి.  

మహిళలకు  ప్రీతికరం   
శ్రావణ నోములు, వ్రతాలు భక్తితోనోచుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటామన్న విశ్వాసముండడంతో మహిళలు ఈ మాసాన్ని అత్యంత ప్రీతికరంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అని పేరొచ్చింది. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడైన  వేంకటేశ్వరస్వామి ఇదే నక్షత్రంలో జన్మించినందున శ్రీవారి ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి, ఆయన సతీమణి లక్ష్మీదేవి, సోదరి గౌరికి ఇదే మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో పలు ఆలయాల్లో సామూహిక వ్రతాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రావణంలో వచ్చే మంగళవారాలతో పాటూ శుక్రవారాలు, శనివారాలు ఆలయాలు ప్రత్యేక పూజలు, భక్తులతో కిటకిటలాడుతాయి. 
(చదవండి: 'మామ్‌పవర్‌ 360’.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మహిళలను తిరిగి..)

శ్రావణంలో వచ్చే పండుగలివే..
శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. వచ్చే నెల 1న రానున్న నాగుల చవితితో పర్వదినాలు ఆరంభమవుతాయి. మరుసటి రోజుననే గరుడ పంచమిని జరుపుకుంటారు. 5న వరమాలక్ష్మీ వ్రతం, 12న రక్షాబంధనం (రాఖీ పౌర్ణిమ), 18, 19 తేదీల్లో వచ్చే శ్రీకృష్ణజన్మాష్టమితో పాటూ బలరామ జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి పండుగలు వరుసగా ఆనందాలను తెచ్చేవే. మాసం చివరిరోజున కూడా పొలాల అమావాస్యను  జరుపుకోవడం ఆనవాయితీ.  వ్రతాలకు శ్రావణమాసాన్ని ఎంచుకోవడంలో ఆరోగ్యపరమైన కారణాలున్నాయని, ప్రత్యేక పూజలకు సన్నాహాలు చేస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు. 
(చదవండి: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?)

మరిన్ని వార్తలు