JEE Mains Results 2022: మనదే హవా

9 Aug, 2022 03:17 IST|Sakshi
రవి కిషోర్‌ 6వ ర్యాంకు, హిమ వంశీ 7వ ర్యాంకు , జలజాక్షి 9వ ర్యాంకు

జేఈఈ మెయిన్‌లో 100 ఎన్టీఏ స్కోర్‌ సాధించిన 24 మందిలో 10 మంది తెలుగువారే.. 

ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున విద్యార్థులు 

మొత్తం మీద 100 ఎన్టీఏ స్కోర్‌ సాధించినవారిలో ఇద్దరు బాలికలు, 22 మంది బాలురు 

టాప్‌ 10 ర్యాంకుల్లో ముగ్గురు ఏపీ విద్యార్థులు  

ఆరు, ఏడు, తొమ్మిది ర్యాంకులతో ధమాకా 

ఎట్టకేలకు మెయిన్‌ స్కోర్లు, ర్యాంకులు ప్రకటించిన ఎన్టీఏ 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు జనరల్‌ కటాఫ్‌ స్కోర్‌ 88.41 

ఈడబ్ల్యూఎస్‌ 63.11, ఓబీసీ 67.00, ఎస్సీ 43.08, ఎస్టీ 26.77 

2021 కంటే పెరిగిన జనరల్‌ కటాఫ్‌ స్కోర్‌ 

బీఆర్క్, బీప్లానింగ్‌ ఫలితాలు త్వరలో విడుదల చేయనున్న ఎన్టీఏ  

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2022 పేపర్‌ 1 (బీఈ, బీటెక్‌) ఫలితాల్లో తెలుగు విద్యార్థులు దుమ్ము లేపేశారు. దేశవ్యాప్తంగా 24 మందికి 100 ఎన్టీఏ స్కోర్‌  రాగా ఇందులో పది మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే. ఈ పది మందిలో ఐదుగురు మన రాష్ట్ర విద్యార్థులు ఉండగా, మరో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారు. ఈ మేరకు జేఈఈ మెయిన్‌ స్కోర్లు, ర్యాంకులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది.

టాప్‌ 10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు చోటు దక్కించుకున్నారు. పెనికలపాటి రవికిషోర్‌ ఆరో ర్యాంకు, మెండ హిమవంశీ ఏడో ర్యాంకు.. పల్లి జలజాక్షి 9వ ర్యాంకు సాధించారు. వీరు ముగ్గురుతోపాటు ఏపీకే చెందిన పోలిశెట్టి కార్తికేయ, కొయ్యాన సుహాస్‌ 100 ఎన్టీఏ స్కోర్‌ సాధించిన వారిలో నిలిచారు. ఇక తెలంగాణ నుంచి రూపేష్‌ బియానీ, ధీరజ్‌ కురుకుంద, జాస్తి యశ్వంత్‌ వీవీఎస్, బుస శివనాగ వెంకట ఆదిత్య, అనికేత్‌ ఛటోపాధ్యాయ 100 ఎన్టీఏ స్కోర్‌ సాధించిన వారిలో ఉన్నారు. కాగా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును శ్రేణిక్‌ మోహన్‌ సకల (మహారాష్ట్ర), రెండో ర్యాంకును నవ్య (రాజస్థాన్‌) సాధించారు. 100 ఎన్టీఏ స్కోర్‌ సాధించిన 24 మందిలో ఇద్దరే బాలికలు. మిగతా 22 మంది బాలురే. 
 
పెరిగిన జనరల్‌ కటాఫ్‌.. 
కాగా జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఎంపికయ్యేందుకు జనరల్‌ విభాగం కటాఫ్‌ స్కోర్‌ గతేడాది కంటే పెరిగింది. మరోవైపు ఇతర కేటగిరీల్లో మాత్రం కటాఫ్‌ స్కోర్‌ తగ్గింది. జేఈఈ మెయిన్‌లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణిస్తారు. వీరు మాత్రమే అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్‌ కేటగిరీలో 1,01,250, ఈడబ్ల్యూఎస్‌ 25,000, ఓబీసీ 67,500, ఎస్సీలు 37,500, ఎస్టీలు 18,750 మందిని ఎంపిక చేస్తారు. ఈ అన్ని కేటగిరీల్లోనూ 0.05 శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు. 
 
మొదటి సెషన్‌లోనే అధికం 
జేఈఈ మెయిన్‌ను 2021లో కరోనా దృష్ట్యా నాలుగుసార్లు నిర్వహించగా ఈసారి మాత్రం రెండు సెషన్లకే పరిమితం చేశారు. జూన్‌ 24 నుంచి 30 వరకు మొదటి సెషన్, జూలై 25 నుంచి 30 వరకు రెండో సెషన్‌ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 10,26,799 మంది దరఖాస్తు చేసుకోగా 9,05,590 మంది హాజరయ్యారు. రెండు సెషన్లలోనూ పరీక్ష రాసిన వారు 4,04,256 మంది ఉన్నారు. అత్యధికంగా మొదటి సెషన్‌లో 8,72,970 మంది దరఖాస్తు చేయగా 7,69,604 మంది హాజరయ్యారు.

రెండో సెషన్‌కు 6,22,034 మంది దరఖాస్తు చేయగా 5,40,242 మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల్లో 6,48,555 మంది బాలురు కాగా 2,57,031 మంది బాలికలున్నారు. ఐదుగురి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.ఇక పేపర్‌–2కు సంబంధించిన బీఆర్క్, బీప్లానింగ్‌ ఫలితాలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది.  
 
అడ్వాన్స్‌డ్‌కు 11 వరకు దరఖాస్తు గడువు.. 
కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియను ఐఐటీ –బాంబే ఆదివారం (ఆగస్టు 7) నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే మెయిన్‌ ఫలితాలు సోమవారం వెలువడడంతో ఒక రోజు ఆలస్యంగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులు ఫీజును 12 సాయంత్రం 5 గంటల లోపు చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డులను 23 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష ఆగస్టు 28న జరుగుతుంది.

ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ సెప్టెంబర్‌ 1న ప్రకటిస్తారు. వాటిపై అదే నెల 3, 4 తేదీల్లో అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకొని ఫైనల్‌ కీని, తుది ఫలితాలను సెప్టెంబర్‌ 11న విడుదల చేస్తారు. బీఆర్క్‌కి సంబంధించిన ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను 14న నిర్వహించి 17న ఫలితాలు ప్రకటిస్తారు. కాగా బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 12 నుంచి ప్రారంభమవుతుంది. 
 
ఐఐటీ బాంబేలో చేరతా.. 
మాది గుంటూరు. నాన్న ఆదినారాయణ ప్రైవేటు సంస్థలో లైబ్రేరియన్‌గా పనిచేస్తారు. అమ్మ నందకుమారి స్టాఫ్‌ నర్సు. ఇంటర్మీడియెట్‌లో 962 మార్కులు సాధించా. జేఈఈ మెయిన్‌లో ఆలిండియా స్థాయిలో ఆరో ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రణాళికాబద్ధంగానే చదవడంతోనే ఇంత చక్కటి ర్యాంకు సాధించగలిగా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ ఎంచుకుంటా. తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవుతా.  
– పెనికలపాటి రవికిషోర్, జేఈఈ మెయిన్, ఆలిండియా 6వ ర్యాంకర్‌  
 
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవుతా.. 
మాది.. శ్రీకాకుళం. నాన్న రవిశంకర్, అమ్మ స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇంటర్మీడియెట్‌లో 972 మార్కులు సాధించా. జేఈఈ మెయిన్‌లో ఓబీసీ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు, ఓపెన్‌ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చదువుతా. తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలన్నదే నా లక్ష్యం.   
– ఎం.హిమవంశీ, జేఈఈ మెయిన్, ఆలిండియా ఏడో ర్యాంకర్‌ 
 
నా లక్ష్యం సివిల్స్‌.. 
మాది శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కాకరపల్లి. నాన్న గోవిందరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ జయలక్ష్మి గృహిణి. వారి ప్రోత్సాహంతోనే నేను రాణిస్తున్నా. ఇంటర్మీడియెట్‌లో 983 మార్కులు సాధించా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌ చేశాక సివిల్స్‌ రాస్తా. సివిల్స్‌ సాధించడమే నా జీవితాశయం.  
–పి.జలజాక్షి, జేఈఈ మెయిన్, ఆలిండియా 9వ ర్యాంకర్‌ 
 
విద్యార్థులు సమానమైన స్కోరు సాధిస్తే.. ముందు ఎవరికి ప్రాధాన్యత?  
కంప్యూటర్‌ బేస్డ్‌లో జరిగే జేఈఈ మెయిన్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో రెండు సెక్షన్లలో ప్రశ్నలు ఇస్తారు. ఎ–సెక్షన్‌లో ఒక్కో సబ్జెక్టులో 20 చొప్పున, బి సెక్షన్‌లో 10 చొప్పున ప్రశ్నలుంటాయి. ఎ–సెక్షన్‌లోని 20 ప్రశ్నలు బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానాలివ్వాలి. ఇక బి సెక్షన్‌లోని న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలివ్వాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.

తప్పుగా సమాధానాలు రాసినవాటికి నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున మైనస్‌ చేస్తారు. రోజుకు రెండు బ్యాచుల చొప్పున ఐదారురోజుల పాటు నిర్వహించే ఈ పరీక్షల్లో ఒకరోజు సులభం, మరో రోజు కష్టంగా ప్రశ్నలున్నా నార్మలైజేషన్‌ ద్వారా దాన్ని సరిసమానంగా ఉండేలా చేసి అభ్యర్థులకు స్కోరును నిర్ణయిస్తారు. ఈ విధానంలో ఏ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన స్కోరు ఉన్నా ‘టై బ్రేక్‌’ విధానాన్ని అనుసరించి ర్యాంకులను ప్రకటిస్తారు. ప్రాధాన్యత క్రమంలో ఇలా ఉంటుంది. 

► తొలుత మ్యాథమెటిక్స్‌లో అభ్యర్థులు సాధించిన స్కోరును పరిగణలోకి తీసుకొని అధిక స్కోరు ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. 
► రెండోదిగా ఫిజిక్సు స్కోరు, మూడోదిగా కెమిస్ట్రీ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు. 
► మూడింటిలోనూ అభ్యర్థులకు సరిసమానమైన స్కోర్‌ ఉంటే.. పరీక్షలో ఆయా సబ్జెక్టుల్లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి.. ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. 
► అందులోనూ సరిసమానమైన స్కోర్‌ ఉంటే.. మ్యాథ్స్‌లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి, ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. దీనిలోనూ సమానంగా ఉంటే ఫిజిక్స్‌లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి, ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దీనిలోనూ అభ్యర్థులకు సరిసమానమైన స్కోర్లు ఉంటే కెమిస్ట్రీలో తప్పు సమాధానాలు తక్కువ ఇచ్చి, సరైన సమాధానాలు ఎక్కువ ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. 
► ఒకవేళ ఈ అన్ని సబ్జెక్టులోనూ ఏ ఇద్దరు అభ్యర్థులు సమానంగా నిలిచినా ముందుగా వయసుపరంగా పెద్దవారికి ప్రాధాన్యమిస్తారు. 
► అప్పటికీ సమానమైన పరిస్థితి ఏర్పడితే దరఖాస్తు నంబర్‌ను అసెండింగ్‌ ఆర్డర్‌లో తీసుకొని ర్యాంకును ప్రకటిస్తారు.     

మరిన్ని వార్తలు