ఎందుకో?.. నేను పుట్టినప్పుడు పూలవాన కురవలేదు..

28 Jun, 2022 16:52 IST|Sakshi

నవ్వులు పూయించిన ముళ్లపూడి

ధవళేశ్వరంలో పుట్టి తెలుగునేలను చుట్టిన రచనా పరిమళం 

నేడు(జూన్‌ 28) హాస్యబ్రహ్మ వెంకట రమణ జయంతి

సీటీఆర్‌ (రాజమహేంద్రవరం): పాత్రికేయునిగా, కథా రచయితగా, సినీ రచయితగా, నిర్మాతగా తెలుగువారి గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న ముళ్లపూడి వెంకట రమణ ధవళేశ్వరంలో 1931 జూన్‌ 28న జన్మించారు.. తన జన్మదినం గురించే ఆయన స్వీయచరిత్రలో విసిరిన చమక్కులను ముందుగా చూద్దాం...‘జ్యేష్ఠా నక్షత్రం, వృశ్చికరాశిలో పుట్టాను. అంటే జూన్‌ 28 తెల్లవారు జామున, 1931లో. పీవీగారు కూడా జూన్‌ ఇరవైయ్యెనిమిదే, 1921లో. అంటే నా కన్నా పదేళ్ల చిన్న. ఈ మాటంటే ఆయన పకాపకా నవ్వారు. ఎందుకో?... రాజమండ్రి, ధవళేశ్వరాల మధ్యనున్న ఆల్కాట్‌ గార్డెన్స్‌ ఆసుపత్రిలో పుట్టాను. నేను పుట్టినప్పుడు దేవదుందుభులు మోగలేదు. అచ్చరలాడలేదు. గంధర్వులు పాడలేదు. పూలవాన కురవలేదు.’’ 

కష్టాలతో చెలిమి... 
పట్టుమని పదేళ్లు రానివయసులోనే ముళ్లపూడి తండ్రిని కోల్పోయారు. కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పొట్ట చేతపట్టుకుని మద్రాసు మహానగరానికి వెళ్లారు. ఒక మెట్టగదిలో ముళ్లపూడి, ఆయన సోదరుడు, తల్లి కాపురం. తల్లి విస్తర్లు కుట్టి, ప్రెస్సులో కంపోజింగ్‌ పనులు చేసి సంసార నౌకను నడిపారు. మధ్యలో 7,8 తరగతులు చదువుకోవడానికి ముళ్లపూడి తల్లి, సోదరుడితో కలసి రాజమండ్రి వచ్చి, ఇన్నీసుపేటలోని కందుకూరి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో చదివారు. తిరిగి మద్రాసు చేరుకున్నారు. ఎస్సెల్సీ వరకు చదువు కొనసాగింది. 


పూలేకాదు, ముళ్ళూ... 

పాత్రికేయ జీవితంలో అందుకున్న సన్మానాలు, పొందిన బిరుదుల, మెళ్లో వేసిన శాలువాలూ, పూలదండలే కాదు, పొందిన అవమానాలు, అగచాట్లు, డబ్బు చిక్కులూ, ఛీత్కారాలు అన్నిటినీ ముళ్లపూడి తన స్వీయచరిత్రలో చెప్పుకొచ్చారు. పొలిటికల్‌ కాలమిస్టుగా పనిచేస్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి గారు క్లబ్‌కు తీసుకువెళ్లి నా పేరు చెప్పి భోజనం లాగించెయ్‌. .అన్నారు..అప్పటికే ఆకలి ‘రుచి’పూర్తిగా తెలిసిన ముళ్లపూడి డైనింగ్‌ హాలులోకి వెళ్లి బేరర్‌కు చెప్పారు. ‘డ్రైవర్సుకీ, బోయెస్‌కీ బాక్‌ సైడ్‌ షెడ్‌లో ఇరికప్పా, పిన్నాలే పో’ అన్నాడు వాడు. సంజీవరెడ్డిగారికి ఏదో అనుమానం వచ్చి, హాలులోకి వచ్చి బేరర్‌ను చివాట్లు పెట్టారు. 
     
సినీ రిపోర్టరుగా ఉండగా గుచ్చుకున్న మరో ముల్లు.. సినీ స్టూడియోలో ఓ సారి ఎస్వీ రంగారావుగారు ఎదురయ్యారు. రమణని పిలిచి చెంప ఛెళ్లు మనిపించారు..‘‘చూడు రమణా! పత్రికకూ, నీ ఆఫీసుకూ ఓ స్టేటస్‌ ఉంది. స్టార్‌గా నాకో దర్జా ఉంది. నువ్విలా మాసిన గడ్డంతో, కాల్చిన చిలకడదుంపలా రావడం ఇన్సల్టు. మీకు డబ్బు లేకపోయినా శుభ్రంగా ఉండవచ్చును గదా’’ అన్నారు ఎస్వీఆర్‌.. 
   
ఇలాంటి అనుభవమే ఒకసారి అక్కినేనితో ఎదురయింది. ఆయన ఏదో కబుర్లు చెబుతూ...‘రమణగారూ. కొన్ని తత్వాలే అంత. ఫరెగ్జాంపుల్, మిమ్మల్ని మార్చడం మీ దేవుడి తరం కాదు, మీకు కోటి రూపాయలిచ్చినా ఈ మురికి బట్టలే వేసుకుంటారు..’ రమణ కోపంతో రిటార్ట్‌ ఇచ్చారు..‘‘సార్‌. ఇవి నలిగిన బట్టలు కావచ్చుకాని, మురికివి మాత్రం కావు. నేను ఒకసారి కట్టివిడిచిన బట్టను ఉతికి ఆరేస్తేకాని కట్టను. మీరు మీ ప్యాంట్లూ, సిల్కు చొక్కాలూ తొడిగి విప్పాక, చిలక్కొయ్యకేస్తారు. పదేసి రోజులు అదే వాడుతారు. నాకున్నది ఒకటే జత. కాని ప్రతిరాత్రి ఉతికారేసుకుంటాను. తువ్వాలు కట్టుకుని పడుకుంటాను. నాకు సిగ్గులేదు కాని, పొగరుంది...’ 


నిరుద్యోగ విజయాలు, పాత్రికేయునిగా ఉద్యోగం 

రెండేళ్ల ‘నిరుద్యోగ విజయాలు’ తరువాత నాటి ప్రముఖ ఆంధ్రపత్రికలో పాత్రికేయునిగా ఉద్యోగం ముళ్లపూడిని వరించింది. పాత్రికేయునిగా తనదైన ముద్ర వేస్తూనే, కథారచయితగా ముళ్లపూడి తన సత్తా చూపారు. రెండుజెళ్ల సీతలూ, సీగానపెసూనాంబలు, బుడుగులూ, అప్పారావులూ ఆయన కలం నుంచి వెలువడ్డాయి. గురజాడ గిరీశం, చిలకమర్తి గణపతి, మొక్కపాటి బారిస్టర్‌ పార్వతీశంలాగా, పానుగంటి జంఘాల శాస్త్రిలాగా ముళ్లపూడి సృష్టించిన అప్పారావు పుస్తకాల పుటల నుంచి వచ్చి, తెలుగువారి జీవితంలోకి చొరబడ్డాడు. (చదవండి: వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ?)


తాగింది కావేరి జలాలు, ఉపాసించింది గోదావరి జలాలు 

తుది వరకు మద్రాసులోనే జీవించినా, ఆయన ధ్యాస, యాస, శ్వాస గోదావరి చుట్టుతానే తిరిగింది. తన 14 ఏటా నుంచి నేస్తం అయిన బాపుతో కలసి నిర్మించిన సాక్షి, అందాలరాముడు, ముత్యాలముగ్గు, స్నేహం, బుద్ధిమంతుడు మొదలైన సినిమాలు ఈ గడ్డనే పురుడు పోసుకున్నాయి. ఈ మాండలికమే ఆ పాత్రలు మాట్లాడాయి.. ఆరుద్ర చెప్పినట్లు ‘‘హాస్యం ముళ్లపూడి వాడి, వేడి తాకిడికి ఈ డేరింది’’ అనడంలో అతిశయోక్తి లేదు. (చదవండి: పిల్లనగ్రోవికి ఒళ్లంతా గేయాలే)

మరిన్ని వార్తలు