కొలువుదీరిన కోదండరామయ్య

26 Apr, 2022 04:47 IST|Sakshi
కోదండరామస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు

రామతీర్థం బోడికొండపై ఆలయ ప్రారంభోత్సవం 

నెల్లిమర్ల రూరల్‌: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం నీలాచలం బోడికొండపై సోమవారం కోదండ రాముడు కొలువుదీరాడు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్ఛారణల మధ్య పండితుల ఈ క్రతువును వైభవంగా జరిపించారు. రామతీర్థం క్షేత్రం యావత్తూ జైశ్రీరామ్‌ నామస్మరణతో పులకించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో ఈ ఆలయం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంది. రూ.3 కోట్ల నిధులతో పూర్తయిన కోదండ రామస్వామి వారి నూతన రాతి దేవాలయంలో గడిచిన మూడ్రోజులూ తిరుపతి, ద్వారకా తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు నిర్విరామంగా ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పూర్తిచేశారు. వేకువజామున యాగశాలలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కుంభారాధన, దాతాది సామాన్య హోమం, పూర్ణాహుతి, యంత్ర, బింబ స్థాపనలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కోదండ రామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం మంత్రులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దిగువనున్న ప్రధాన ఆలయంలో సీతారామస్వామిని దర్శించుకున్నారు.

కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సూర్యనారాయణరాజు, ఇ.రఘురాజు,  ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ హరిజవహర్‌లాల్, కలెక్టర్‌ సూర్యకుమారి, ప్రత్యేకాధికారి భ్రమరాంబ ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు