వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు! 

15 Jun, 2022 14:14 IST|Sakshi
చనిపోయిన వారి చిత్రాన్ని సమాధిపై ఏర్పాటు చేసిన దృశ్యం

ధర్మవరం రూరల్‌(శ్రీ సత్య సాయి జిల్లా): చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా సమాధులు కట్టడం, వర్ధంతులు, జయంతులు, పండుగ పూట పూజలు చేయడం మామూలుగా మనం చూస్తుంటాం. అయితే ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామంలో వింత ఆచారం నడుస్తోంది. చనిపోయిన వారికి ఇక్కడ సమాధులు కట్టడమే కాకుండా పైన దేవతామూర్తుల విగ్రహాలు ఉంచి చిన్న పాటి గుడిలాంటిది నిర్మిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం పూజలు చేస్తుంటారు. దీంతో పాటు ఏటా తొలి ఏకాదశి రోజున ఇక్కడ జాతర నిర్వహిస్తుండం గమనార్హం.

సమాధిపైన చనిపోయిన వారి చిత్రం.. 
45 ఏళ్ల క్రితం బళ్లారి ప్రాంతం నుంచి ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామానికి పెద్ద బొమ్మయ్య వంశీకులు వచ్చి స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన కుటుంబాలు గ్రామంలో 14 వరకు ఉన్నాయి. పెద్ద బొమ్మయ్య మరణానంతరం అతని జ్ఞాపకార్థం సమాధి నిర్మించిన కుటుంబీకులు.. పూడ్చిన చోటనే గంగమ్మ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి పెద్ద బొమ్మయ్య వంశీకులు ఎవరు చనిపోయినా ఆలయం పక్కనే వారిని ఖననం చేసి సమాధి కడుతున్నారు.

పెద్ద బొమ్మయ్య సమాధిపై ప్రతిష్టించిన గంగమ్మ దేవత విగ్రహాలు 

అనంతరం వాటిపై చిన్నదేవాలయం లాంటి నిర్మాణమో.. లేకుంటే పూడ్చిన వ్యక్తి చిత్రాన్నో దానిపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి చిన్నచిన్న ఆలయాలు కట్టిన ఆలయాలు నాలుగుదాకా ఉన్నాయి. ఇక.. సమాధులపై వేసిన చిత్రాలను దూరం నుంచి చూస్తే ఎవరో పడుకుని ఉన్నట్లుగా భ్రమ కలుగుతుండడం గమనార్హం. పెద్ద బొమ్మయ్య వంశస్తుల మరో ప్రత్యేకత ఏమిటంటే తమ కుటుంబంలో పుట్టే ప్రతి బిడ్డకూ   పూరీ్వకుడు బొమ్మయ్యే పేరు కొనసాగిస్తుండడం. ప్రస్తుతం గ్రామంలో చిన్న బొమ్మయ్య, పెద్ద బొమ్మయ్య, నడిపి బొమ్మయ్య, సన్న బొమ్మయ్య ఇలా మగవాళ్ల పేర్లన్నీ ఒకేలా ఉన్నాయి.  

తాతల కాలం నుంచి అఖండం వెలుగుతోంది 
మేమంతా పూరీ్వకులను పూజిస్తుంటాం. వారి జ్ఞాపకార్థం సమాధులను నిర్మించి వాటిపై ప్రతిమలు ఏర్పాటు చేయించి పూజలు చేస్తాం. సమాధిపై నిర్మించిన గంగమ్మ గుడిలో మా తాతలు పెట్టిన అఖండం నేటికీ వెలుగుతోంది. కేవలం ఒత్తులు మాత్రమే మారుస్తుంటాం. ఆచారాన్ని మా పిల్లలకు కూడా నేర్పుతాం.  
– చిన్నబొమ్మయ్య, సుబ్బరావుపేట 


 

మరిన్ని వార్తలు