మారటోరియం మరో రెండేళ్లు

4 Apr, 2022 09:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించి విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులపై గతంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని (మారటోరియం)ను కొన్ని షరతులతో ఏఐసీటీఈ మరో రెండేళ్లు పొడిగించింది. దేశంలో ఇంజనీరింగ్‌ తదితర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏఐసీటీఈ ఓ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక మేరకు కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా తాత్కాలిక నిషేధాన్ని రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చింది.

డిమాండ్‌కు మించి కాలేజీలు, సీట్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి మారటోరియంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. పీపీపీ మోడ్‌తో సంప్రదాయ కోర్సులతో పాటు మల్టీ డిసిప్లినరీలతో ఉపాధి అవకాశాలున్న ప్రాంతాల్లో కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది. ట్రస్టు, సొసైటీ, కంపెనీగా నమోదైన మూడేళ్లలో రూ.5 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌ కలిగిన పరిశ్రమలు స్థాపించే సంస్థలకు మినహాయింపు వర్తిస్తుంది. గత ఏడాది 100 లోపు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్కు (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో చోటు సాధించి 10 వేల మంది విద్యార్ధులతో 25 ఏళ్లుగా ఇతర విద్యాసంస్థలు నడుపుతున్న దాతృత్వ సంస్థలకు కూడా మినహాయింపునివ్వనున్నారు.

ప్రాంతీయ భాషల్లోకి సాంకేతిక పదాలు 
సాంకేతిక విద్యా కోర్సులను ఆంగ్లంలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శాస్త్రీయ, సాంకేతిక పదాలను ఆయా భాషల్లోకి అనువదించేలా ఏఐసీటీఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు కమిషన్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ టెర్మినాలజీ (సీఎస్టీటీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక భాషల్లో సాంకేతిక విద్యా కోర్సులను బోధించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 

(చదవండి: ‘టెలిస్కోపిక్‌’తో తక్కువ బిల్లులు)

మరిన్ని వార్తలు