చిన్న వయసు.. పెద్ద మనసు

27 Feb, 2022 10:09 IST|Sakshi
ఆలయానికి విరాళాన్ని అందించేందుకు పొదుపు మొత్తాన్ని లెక్కిస్తున్న బాలుడు 

ఆలయ పునర్‌ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం

సాక్షి, గాలివీడు (కడప​): ఆ బాలుడి వయసు పదేళ్లు.. అందరు పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ తనదైన లోకంలో విహరించడంతోనే సరిపెట్టుకోలేదు. సొంతూరులోని ఓ ఆలయ పునరుద్ధరణకు భూరి విరాళమిచ్చి పెద్దమనసు చాటు కున్నాడు. వివరాలిలా.. గాలివీడుకు చెందిన భువనేశ్వరి సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె కుమారుడు బండ్లకుంట బాహుబలేయ.

గాలివీడులో శిథిలావస్థలో ఉన్న చారిత్రక పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దాతల సహకారంతో పునరుద్ధరిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాహుబలేయ తాను నాలుగేళ్లుగా పొదుపు చేసుకున్న రూ.50 వేల నగదును విరాళంగా అందించాలనుకున్నాడు. తన అమ్మమ్మ లక్ష్మిదేవి, తాతయ్య దివంగత పులి వెంకటరమణల పేరు మీద రాయచోటిలోని కుటుంబ సభ్యుల ద్వారా నగదును శనివారం కమిటీ సభ్యులకు అందజేశాడు. 

మరిన్ని వార్తలు