రాకెట్‌లా దూసుకెళ్తున్న ఏపీ శాస్త్రవేత్త.. సాయిదివ్య స్పెషల్‌ ఇదే..

20 Nov, 2022 13:04 IST|Sakshi

పేలోడ్‌ను తయారు చేసిన తెనాలికి చెందిన సాయిదివ్య 

విక్రమ్‌–ఎస్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపిన వైనం 

వాతావరణంలో తేమ, ఇతర వివరాలను నమోదు చేసిన పేలోడ్‌  

తెనాలిరూరల్‌: దేశ చరిత్రలో తొలిసారి ప్రయోగించిన ప్రైవేట్‌ రాకెట్‌ ప్రారంభ్‌(విక్రమ్‌–ఎస్‌) విజయవంతం అవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టంలో తెనాలి యువతి భాగస్వామి అయ్యింది. పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్త సాయిదివ్య కూరపాటి రూపొందించిన 200 గ్రాముల పేలోడ్‌ను విక్రమ్‌–ఎస్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. 

ఉపగ్రహ కమ్యూనికేషన్‌ రంగంలో పీహెడీ స్కాలర్‌ అయిన సాయిదివ్య తన భర్త కొత్తమాసు రఘురామ్‌తో కలసి ఎన్‌–స్పేస్‌టెక్‌ ఇండియా పేరిట సంస్థను ఏర్పాటు చేసి ఉపగ్రహ తయారీపై ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో సాయిదివ్య మైక్రో శాటిలైట్‌ ‘లక్ష్య శాట్‌’ను తయారు చేయగా యూకేలోని బీ–2 స్పేస్‌ సంస్థ ఆస్తరావరణం(స్టాటోస్పియర్‌)లోకి పంపింది. ప్రస్తుతం ఆమె తయారుచేసిన పేలోడ్‌ను హైదరాబాద్‌లోని స్కైరూట్‌ ఏరో స్పేస్‌ సంస్థకు పంపగా, అక్కడ నుంచి శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌కు పంపారు. ప్రారంభ్‌ రాకెట్‌ ద్వారా సాయిదివ్య తయారు చేసిన పేలోడ్‌తోపాటు మరో రెండు సంస్థలు తయారు చేసిన పేలోడ్‌లను ప్రయోగించారు.  

- తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్న నాటి నుంచి సాయిదివ్య స్కైరూట్‌ సంస్థతో సంప్రదిస్తూ వచ్చారు. తెనాలిలోని తన పరిశోధన కేంద్రంలోనే పేలోడ్‌ తయారు చేశారు. దీనిని ఇతర పేలోడ్‌లతో అనుసంథానించడం, రాకెట్‌ అంతరభాగంలో సరిపోయే విధంగా రూపొందించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వాతావరణంలో ఉన్న తేమ, ఇతర వివరాలను నమోదు చేసేలా పేలోడ్‌ను రూపొందించారు. 

- తెనాలిలో తయారైన పేలోడ్‌ను హైదరాబాద్‌ పంపారు. అక్కడ కొన్ని ప్రాథమిక పరీక్షల అనంతరం రాకెట్‌లో అమర్చేందుకు షార్‌కు పంపారు. రాకెట్‌లో అమర్చి, పనితీరును పరిశీలించారు. పేలోడ్‌ నుంచి వస్తున్న సిగ్నల్స్, ఇతర సమాచార వ్యవస్థను అధ్యయనం చేశారు. విజయవంతంగా రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లగా అందులో తెనాలిలో తయారుకాబడిన పేలోడ్‌ ఉండడం విశేషం. 

టూ వే కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ తయారీ 
విక్రమ్‌–ఎస్‌ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలో విక్రమ్‌–1 పేరిట మరో ప్రైవేట్‌ రాకెట్‌ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. విక్రమ్‌–ఎస్‌లోని పేలోడ్‌లు కేవలం వాతావరణంలోని తేమ వంటి వివరాలను మాత్రమే నమోదు చేశాయి. విక్రమ్‌–1లో టూ వే కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. విక్రమ్‌–ఎస్‌ను సబ్‌–ఆర్బిటల్‌లోకి మాత్రమే ప్రయోగించారు. కేవలం 89.5 కిలోమీటర్లు దూరం ఈ రాకెట్‌ వెళ్లగా, భవిష్యత్తులో తయారుకానున్న విక్రమ్‌–1ను ఆర్బిటల్‌(కక్ష్య)లోకి పంపే ఆలోచనలో ఉన్నారు. ఈ రాకెట్‌లో అమర్చే పేలోడ్‌లలో టూ వే కమ్యూనికేషన్‌ వ్యవ్థను అమరుస్తారు. కక్ష్యలోని శాటిలైట్‌తో సంప్రదించడం, దాని నుంచి సమాచారం రాబట్టడం చేస్తారు. ఇందు కోసం సాయిదివ్య పేలోడ్‌ తయారు చేస్తున్నారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ కోసం సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. 

అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం..
స్పేస్‌ టెక్నాలజీని విద్యార్థులు, రీసెర్చ్‌ చేసే వాళ్లకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఎన్‌–స్పేస్‌ టెక్‌ ఇండియా సంస్థను నెలకొల్పాం. ఉపగ్రహాలు, రాకెట్‌ల ద్వారా నింగిలోకి పంపే పేలోడ్‌ల తయారీ, వాటికి సంబంధించిన ప్రయోగాలను వీరికి అందుబాటులోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో ఈ రంగంలో మరింత మంది రాణించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రైవేటు ఉపగ్రహల తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగంలో భాగస్వాములం అవడం సంతోషంగా ఉంది.  
– కూరపాటి సాయిదివ్య, యువ శాస్త్రవేత్త   

మరిన్ని వార్తలు