దగదర్తి ఎయిర్‌పోర్ట్‌ డీపీఆర్‌కు టెండర్లు

19 Nov, 2020 03:22 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మాణం

నోటిఫికేషన్‌ జారీ చేసిన ఇన్‌క్యాప్‌

సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ టెండర్లను పిలిచింది. ప్రయాణికులు, కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిర్వహించే విధంగా డీపీఆర్‌ తయారు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఇన్‌క్యాప్‌) నోటిఫికేషన్‌ జారీ చేసింది. నెల్లూరు జిల్లా చుట్టుపక్కల పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుండటంతో కార్గో రవాణాకు ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ఎండీ వి.ఎన్‌.భరత్‌రెడ్డి తెలిపారు.

ఇప్పటికే చెన్నై ఎయిర్‌పోర్టులో కార్గో హ్యాండలింగ్‌ గరిష్ట స్థాయికి చేరడం, కృష్ణపట్నం పోర్టుకు అదనంగా ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, కృష్ణపట్నం సమీపంలో భారీ పారిశ్రామిక పార్కు వంటివి ఏర్పాటు కానుండటంతో కార్గో రవాణా కేంద్రంగా దగదర్తి ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికులతో పాటు సరకు రవాణాకు ఉన్న వ్యాపార అవకాశాలను పరిశీలిస్తూ సమగ్ర డీపీఆర్‌ను తయారు చేయడానికి  టెండర్లు పిలిచామని, ఆసక్తి గల సంస్థలు డిసెంబర్‌ 2లోగా బిడ్లు దాఖలు చేయాలన్నారు. సుమారు 1,350 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని ఏపీఏడీసీఎల్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. డీపీఆర్‌ తయారు కాగానే క్యాబినెట్‌ ఆమోదానికి పంపి పనులు ప్రారంభించనున్నట్లు  భరత్‌ రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు