South Coast Railway Zone: కలల జోన్‌కు సొంతగూడు

15 Nov, 2022 08:45 IST|Sakshi

త్వరలోనే రైల్వే జోన్‌ భవన పనులకు టెండర్లు

రూ.106 కోట్లతో హెడ్‌ క్వార్టర్స్‌ నిర్మాణం

వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక నిర్మాణాలు

36 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు

రైల్వే బోర్డు ఆదేశిస్తే..తాత్కాలిక కార్యకలాపాలూ ప్రారంభించే అవకాశం

జోనల్‌ మేనేజర్‌ తాత్కాలిక కార్యాలయంగా డీఆర్‌ఎం ఆఫీస్‌

సాక్షి, విశాఖపట్నం:  కలల జోన్‌ పనులు ప్రారంభమయ్యేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ పనులకు త్వరలో టెండర్లు పిలిచేందుకు రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. ప్రస్తుత డీఆర్‌ఎం కార్యాలయానికి, రైల్వే స్టేషన్‌ మధ్యలో ఉన్న వైర్‌లెస్‌ కాలనీలో రూ.106 కోట్ల వ్యయంతో ప్రధాన కార్యాలయం నిర్మించనున్నారు. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక నిర్మాణంగా ఈ కార్యాలయం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే తయారు చేసిన డిజైన్లకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పనులు ప్రారంభించిన 36 నెలల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఈలోగా జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించాలని బోర్డు నిర్ణయిస్తే.. డీఆర్‌ఎం కార్యాలయం నుంచి తాత్కాలికంగా జోనల్‌ మేనేజర్‌ బాధ్యతలు నిర్వర్తించేలా కూడా సన్నాహాలు చేస్తున్నారు. 

టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు 
రైల్వే జోన్‌ హెడ్‌క్వార్టర్స్‌ భవన నిర్మాణానికి ఈ నెలాఖరులోగా వర్చువల్‌గా ప్రధాని మోదీ చేతుల మీదుగానే శంకుస్థాపన నిర్వహించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. శంకుస్థాపన జరిగిన వెంటనే టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైర్‌లెస్‌ కాలనీలో ఉన్న 13 ఎకరాల్లో 8 ఎకరాల విస్తీర్ణంలో హెడ్‌క్వార్టర్స్‌ రానుంది. రూ.106 కోట్ల వ్యయంతో జోన్‌ ప్రధాన కార్యాలయానికి టెండర్లు పిలవనున్నారు. మొత్తం ఏడు ఫ్లోర్లలో హెడ్‌క్వార్టర్స్‌ బిల్డింగ్‌ ఉండనుంది. ప్రతి భవనానికి 2 యాక్సెస్‌ పాయింట్స్, రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బీటీరోడ్స్‌ కోసం రూ.2.64 కోట్లు, సీసీ రోడ్లకు రూ.1.66 కోట్లు, ఫుట్‌పాత్‌ ఏరియాకు రూ.32 లక్షలు, పార్కింగ్‌ పావ్‌డ్‌ ఏరియా కోసం రూ.1.08 కోట్లు, ప్లాంటేషన్‌కు రూ.2.16కోట్లు, బిల్డ్‌అప్‌ ఏరియాకు రూ.71.64 కోట్లు, బేస్‌మెంట్, స్టిల్ట్‌లో పార్కింగ్‌ కోసం రూ.21 కోట్లు ఖర్చు చేయనున్నారు. టెండర్లు ఖరారు చేసిన తర్వాత అగ్రిమెంట్‌ జరిపి.. 36 నెలల్లో భవనాన్ని పూర్తి చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. 

తాత్కాలిక సేవలు మొదలయ్యేనా.? 
2019 ఫిబ్రవరి 28న కేబినెట్‌ ఆమోద ముద్రవేస్తూ విశాఖ కేంద్రంగా కొత్త జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజా పరిణామాలతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను సమర్థంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా జోన్‌ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనే ఆదేశాలు కూడా ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. ఒకవేళ బిల్డింగ్‌ నిర్మాణంతో పనిలేకుండా జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్‌ఎం కార్యాలయాన్ని వినియోగించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్‌ కోస్ట్‌ జోన్‌ ఓఎస్‌డీ, తను సమర్పించిన జోన్‌ డీపీఆర్‌లోనూ పొందుపరిచారు. జోనల్‌ కార్యాలయానికి సరిపడా నిర్మాణాలు ఉండటంతో జీఎం కార్యాలయాన్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టే అవకాశాలున్నాయి. 

శభాష్‌.. సత్పతి 
ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన రైలేమంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్‌ త్రిపాఠీ.. వాల్తేరు స్టేషన్‌ పరిసరాలను చూసి ఆశ్చర్యపోయారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ అతి సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఎక్కడా లేని విధంగా అతి తక్కువ సమయంలోనే వాల్తేరు డివిజన్‌ నుంచి అత్యధికంగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తిరిగేలా శ్రమించిన డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతిని అభినందించారు. వినూత్న విధానాలతో డివిజన్‌ను లాభాల బాటలో తీసుకెళ్తున్నారంటూ ప్రశంసించారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి ఫిర్యాదుని, సలహాలను స్వీకరించి దానికనుగుణంగా వ్యవహరించడం నిజంగా అరుదని కితాబిచ్చారు. జోన్‌ హెడ్‌ క్వార్టర్స్, విశాఖపట్నం రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు విషయంలోనూ ఇదే తరహాలో పర్యవేక్షించి అద్భుత ఫలితాలు తీసుకురావాలని డీఆర్‌ఎంకు రైల్వే మంత్రి స్వయంగా బాధ్యతలు అప్పగించడం విశేషం. 

ప్రపంచ స్థాయి భవనం 
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హెడ్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలు పెడుతున్నాం. వైర్‌లెస్‌ కాలనీలో అత్యద్భుతంగా ప్రపంచస్థాయి భవనాన్ని నిర్మించనున్నాం. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక కట్టడంగా హెడ్‌క్వార్టర్స్‌ ఉండాలని రైల్వే మంత్రి సూచించారు. పాత వైర్‌లెస్‌ కాలనీలోని 13 ఎకరాల్లో భూమిని జోన్‌ కోసం సమీకరించాం. ఇందులో తొలి దశలో 8 ఎకరాల్లో మల్టీ స్టోరీడ్‌ బిల్డింగ్స్‌ రానున్నాయి. కచ్చితంగా విశాఖ కేంద్రంగా రాబోతున్న సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ బిల్డింగ్‌ ప్రపంచ స్థాయి భవనంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
– అనూప్‌కుమార్‌ సత్పతి, వాల్తేరు డీఆర్‌ఎం  

మరిన్ని వార్తలు