టెన్నిస్‌ క్రీడాకారిణి జాఫ్రీన్‌కు జాతీయ పురస్కారం

1 Nov, 2021 14:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: బధిరుల (డెఫ్‌) ఒలింపిక్స్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి షేక్‌ జాఫ్రీన్‌ జాతీయ పురస్కారానికి ఎంపికైంది. విభిన్న ప్రతిభావంతుల సాధికారత–2020లో భాగంగా ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా జాఫ్రీన్‌ అవార్డును అందుకుంటారు. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ లేఖ పంపినట్టు జాఫ్రీన్‌ తండ్రి జాకీర్‌ ఆదివారం తెలిపారు. కర్నూలుకు చెందిన జాఫ్రీన్‌ అంతర్జాతీయ స్థాయిలో 9 పతకాలు, జాతీయ స్థాయిలో 8 బంగారు పతకాలు సాధించింది.

2017లో టర్కీలో జరిగిన బధిరుల (డెఫ్‌) ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. భారత డెఫ్‌ టెన్నిస్‌ జట్టు సారథిగా ఉన్న ఆమె ర్యాంకింగ్స్‌ పరంగా దేశంలో 1వ, అంతర్జాతీయంగా 12వ స్థానంలో కొనసాగుతోంది. 2022లో బ్రెజిల్‌లో జరిగే డెఫ్‌ ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్టు జాఫ్రీన్‌ ‘సాక్షి’తో చెప్పింది. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం జాఫ్రీన్‌ హైదరాబాద్‌లో ఎంసీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది.

చదవండి: హరిత టపాసులతో కాలుష్యానికి చెక్‌ 

మరిన్ని వార్తలు