ప్రశాంతంగా టెన్త్‌ పరీక్షలు..

28 Apr, 2022 04:28 IST|Sakshi

98.97 శాతం విద్యార్థుల హాజరు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన బుధవారం 98.97 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులకు గాను 6,15,318 మంది హాజరయ్యారన్నారు. వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో 3 చొప్పున మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

దానిని లీక్‌గా పరిగణించలేం..
తొలిరోజు టెన్త్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు సోషల్‌ మీడియా, కొన్ని చానల్స్‌లో జరిగిన ప్రచారం వాస్తవం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌  సురేష్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఉదయం 11 గంటల సమయంలో ఎవరో 10వ తరగతి ప్రశ్నపత్రం, పరీక్ష కేంద్రంలోని ఫొటోలు సర్క్యులేట్‌ చేయడం ప్రారంభించినట్లు తమకు తెలిసిందని వెల్లడించారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైనందున దానిని లీక్‌గా పరిగణించలేమని పేర్కొన్నారు. అలజడి రేకెత్తించడానికి ఇది ఎవరో కావాలనే సృష్టించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. నంద్యాల జిల్లా కొలిమగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్‌ కేంద్రంగా ఇది జరిగినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఇందుకు కారణమైన వ్యక్తులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. బాధ్యులైన చీఫ్‌ సూపర్‌వైజర్, ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  పరీక్ష కేంద్రం వద్ద నిబంధనల మేరకు మొబైల్‌ ఫోన్లను లోపలకు అనుమతించరాదని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. ప్రశ్నపత్రం  వాట్సాప్‌లో హల్‌చల్‌ అయిన వ్యవహారంలో కర్నూలు డీఈవో ప్రాథమిక విచారణ జరిపి,  ప్రశ్నపత్రం వెలుగులోకి వచ్చిన పరీక్ష కేంద్రాన్ని గుర్తించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష విధుల నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్‌ అధికారి, సంబంధిత పరీక్ష గది ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు.  ఈ ఘటన పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత జరిగింది కాబట్టి ఇది మాల్‌ప్రాక్టీస్‌ కిందకు వస్తుందని, ప్రశ్నపత్రం లీకేజి కిందకు రాదని దేవానందరెడ్డి స్పష్టం చేశారు.

‘నారాయణ’ ఉపాధ్యాయుడి నిర్వాకం
చిత్తూరు (కలెక్టరేట్‌): పదో తరగతి పరీక్షల్లో అడ్డదారుల్లో ర్యాంకులను సాధించేందుకు నారాయణ స్కూలు సిబ్బంది చేసిన యత్నం బహిర్గతమైంది. చిత్తూరులోని ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో కాంపోజిట్‌ తెలుగు ప్రశ్నపత్రం ఫొటో కాపీ చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని డీఈవో శ్రీరామ్‌ పురుషోత్తం కలెక్టర్‌ హరినారాయణన్‌ దృష్టికి తీసుకెళ్లి.. చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గిరిధర్‌ అనే వ్యక్తి ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్‌లో పోస్ట్‌ చేసినట్లు గుర్తించారు. అతను తిరుపతిలోని ఎస్వీ బ్రాంచ్‌ నారాయణ పాఠశాలలో పదో తరగతి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరుగుతోంది. 

మరిన్ని వార్తలు