జూన్‌ 7 నుంచి టెన్త్‌ పరీక్షలు

4 Feb, 2021 03:53 IST|Sakshi

16వ తేదీ వరకు నిర్వహణ 

ఏడు పేపర్లకే పరిమితం

షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి సురేష్‌

జూలై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం

సాక్షి, అమరావతి: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలోని సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం జూలై 1 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. టెన్త్, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

టెన్త్‌లో 7 పేపర్లు:  పాఠశాలలను 220 రోజులు నిర్వహించాల్సి ఉండగా కరోనా వల్ల ఈసారి 167 రోజులే నిర్వహించగలుగుతున్నాం. సిలబస్‌లో 35 శాతం తగ్గించి పరీక్షలు నిర్వహిస్తాం. జూన్‌ 5వ తేదీ వరకు పదో తరగతి క్లాసులు నిర్వహిస్తాం. జూన్‌ 7నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఏడు పేపర్లు ఉంటాయి. లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2, ఇంగ్లిష్, లెక్కలు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో 100 మార్కులకు ఒక్కొక్క పేపర్‌ చొప్పున ఉంటుంది. సైన్స్‌కు మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. ఫిజికల్‌ సైన్స్‌ 50 మార్కులకు, బయలాజికల్‌ సైన్స్‌ 50 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తాం.

జూలై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం
మే నెల 15వ తేదీ వరకు 1 నుంచి 9వ తరగతి క్లాసులు నిర్వహిస్తాం. ఈ సారి వేసవి సెలవులు లేవు. పరిస్థితిని బట్టి ఒంటిపూట బడులు నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మే 3 నుంచి 15 వరకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తాం. మే 16 నుంచి జూన్‌ 30 వరకు సెలవులు ఇస్తాం. జూలై 1న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.  

మే 5 నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు 
ఇంటర్మీడియెట్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విధంగా మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 24 వరకు రెండు సెషన్లుగా జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తాం. ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ పరీక్షల ఫీజును 30 శాతం పెంచాల్సి ఉంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫీజులు పెంచొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దాంతో గత ఏడాది మాదిరిగానే పరీక్ష ఫీజు రూ.490, దరఖాస్తు ఫీజు రూ.10, ప్రాక్టికల్స్‌ ఫీజు రూ.190 చొప్పున మాత్రమే ఈ ఏడాది వసూలు చేస్తాం. గత ఏడాది కరోనా కారణంగా అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ నిర్వహించలేకపోయాం. ఈ ఏడాది నిర్వహించే పరీక్షలతోపాటు ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉన్నవారు మొదటి ఏడాది పరీక్షలు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రాసుకోవచ్చు. గత ఏడాది ఇంటర్మీడియెట్‌ పాస్‌ అయిన వారు కూడా ఇప్పుడు ఆ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసే అవకాశం కల్పించాం. 

మరిన్ని వార్తలు