Midde Thota: పండంటి పొదరిల్లు... మేడపైనే పండ్ల తోట

28 Jul, 2021 14:17 IST|Sakshi

ఓ విశ్రాంత సైనికుడి ఆదర్శం

వర్మీ కంపోస్ట్‌ తయారు చేసి మరీ మొక్కలకు వినియోగం 

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మనకు కావాల్సిన పళ్లు, కూరగాయలను మనం మార్కెట్‌ నుంచి తెచ్చుకుంటాం. కానీ అవన్నీ మన ఇంటి వద్దే పండించుకుంటే.. ఆ ఆనందమే వేరు కదా. ఓ మాజీ సైనికుడు అదే చేస్తున్నాడు. డాబా పైనే రకరకాల పండ్లను పండిస్తూ తన ఇంటినే ఓ పండ్ల తోటల వనంగా మార్చేశాడు. ఆ మొక్కలకు వర్మీ కంపోస్ట్‌ ఎరువునే వినియోగిస్తూ పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడటంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఆన్‌లైన్‌ నుంచి మొక్కల కొనుగోలు
విశాఖ జిల్లా కొత్తపాలెం దుర్గానగర్‌కు చెందిన పూజారి శ్రీనివాసరావు రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి. 2017లో రిటైర్డ్‌ అయిన ఆయన ప్రస్తుతం ఆర్‌సీసీవీఎల్‌లో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు మొక్కల పెంపకంపై మక్కువ. మరీ ముఖ్యంగా పండ్ల తోటలు పెంచడం అంటే చాలా ఇష్టం. ముందుగా 2018 నుంచి ఇంటి చుట్టూ పూల మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత ఆన్‌లైన్‌ నుంచి మొక్కలు తెప్పించి మేడపై పెంచడం మొదలెట్టారు. ఇప్పుడు ఆ ఇల్లు పలు రకాల పండ్ల మొక్కలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఫైనాపిల్, డ్రాగన్‌ ఫ్రూట్, తీపి బత్తాయి, ద్రాక్ష, మిరియాలు, లిచి, మామిడి, దొండ, అరటి చెట్లు, తైవాన్‌ జామ తదితర మొక్కలతో పాటు, బోన్సాయ్‌ మొక్కలనూ పెంచుతున్నారు. 

ఇంట్లోనే వర్మీ కంపోస్ట్‌ తయారీ..
పాడైపోయిన ప్లాస్టిక్‌ బకెట్లను మొక్కల పెంపకానికి అనువుగా తీర్చిదిద్దడం విశేషం. మొక్కలకు వర్మీ కంపోస్టునే  ఎరువుగా వినియోగిస్తున్నారు. పొడి వ్యర్థాలను మాత్రమే జీవీఎంసీ సిబ్బందికి ఇచ్చేసి తడి వ్యర్థాల సాయంతో ఇంట్లోనే వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు ఇల్లు పచ్చదనంతో కళకళలాడిపోతోంది.

 

ఎంతో ఆనందంగా ఉంది.. 
మా ఇంటి మేడపైనే పండ్ల మొక్కలు పెంచడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంటిల్లిపాదీ తినగా మిగిలిన పండ్లను స్నేహితులు, బంధువులకు ఇస్తుంటాను. తెలంగాణకు చెందిన ఓ స్నేహితుడి వద్ద వర్మీ కంపోస్ట్‌ ఎరువు తయారు చేయడం నేర్చుకుని మరీ మొక్కలకు వినియోగిస్తున్నాను. 
–  పూజారి శ్రీనివాసరావు, కొత్తపాలెం దుర్గానగర్, విశాఖ జిల్లా  
 

మరిన్ని వార్తలు