Mirabai Chanu: ‘సిల్వర్‌’ వంటి శిక్షకుడు

26 Jul, 2021 04:11 IST|Sakshi
మీరాబాయి చానుతో తంబి(ఫైల్‌)

ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత ‘మీరా’ విజయంలో తంబి పాత్ర 

సీనియర్‌ ఫిజియాలజిస్ట్‌గా శిక్షణ

ఆమె సామర్థ్యం, సాధన వెనుక తంబి సలహాలు

ఏలూరు రూరల్‌: టోక్యో ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో మీరాబాయి చాను సిల్వర్‌ మెడల్‌ సాధించింది. ఆ విజయానికి దేశం యావత్తూ సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆమె విజయం వెనుక, ఆమె కఠోర సాధన వెనుక, ఆమె పడ్డ కష్టం వెనుక.. ఓ తెలుగోడూ ఉన్నాడు.. అతడే మెడబాల తంబి. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం, వంగూరు గ్రామానికి చెందిన మెడబాల తంబి.. పాటియాలలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) సెంటర్‌లో ఫిజియాలజీ విభాగం చీఫ్‌గా సేవలందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

క్రీడాకారుల శరీర భాగాల పటుత్వం, గుండె, ఊపిరితిత్తుల పనితీరును పరిశీలిస్తారు. వారి ఊపితిత్తుల సామర్థ్యం, ఆక్సిజన్‌ శాతం వంటి వాటిపై పరిశోధనలు చేసి.. నివేదికను చీఫ్‌ కోచ్‌కు అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా క్రీడాకారుడికి ఎలాంటి ఎక్సైర్‌సైజ్‌లు అవసరమో చీఫ్‌కోచ్‌ నిర్ణయిస్తాడు. అలాగే ఏ క్రీడాకారుడు ఎలాంటి క్రీడల్లో రాణించగలడు.. ఎలాంటి శిక్షణ తీసుకోవాలి.. తదితర అంశాల్లోనూ తంబి సలహాలిస్తుంటారు. ఓ సీనియర్‌ ఫిజియాలజిస్ట్‌గా, ఫిజియాలజీ విభాగం చీఫ్‌గా ఇతర క్రీడాకారులందరితో పాటు మీరాబాయి చాను విషయంలోనూ తంబి ఇవన్నీ నిర్వహించి.. ఆ విధంగా ఆమె విజయంలో పాలుపంచుకున్నారు. 

పేదరికంలో పుట్టి.. అంచెలంచెలుగా ఎదిగి.. 
నిరుపేద కుటుంబంలో పుట్టిన తంబి చిన్ననాటి నుంచి చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. తల్లిదండ్రులు నాగమణి, నకులుడు ప్రోత్సాహంతో ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ చదివారు. గురువులైన మల్లెం కుమార్, బోడేపూడి నరసింహారావుల సహకారంతో ఆశ్రం కళాశాలలో ఫిజియాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. అదే సమయంలో పలు కళాశాలల్లో ఆచార్యుడిగా పనిచేస్తూ 2013 ఆలిండియా ఎయిమ్స్‌ ఎంట్రన్స్‌ ఫిజియాలజీ విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. 2014లో యూపీఎస్సీ ద్వారా సాయ్‌లో సైంటిస్ట్‌గా నియమితుడై.. ప్రస్తుతం పాటియాల సాయ్‌ సెంటర్‌ ఫిజియాలజీ విభాగం చీఫ్‌గా సేవలు అందిస్తున్నాడు.  

మరిన్ని వార్తలు