గడపగడపలో జగన్నినాదం 

10 Jul, 2022 03:49 IST|Sakshi

 సీఎంగా మళ్లీ జగన్‌ ప్రమాణం తథ్యం 

పేదల సంక్షేమం కోరే ప్రభుత్వమిది 

గాంధీ కాంక్షించిన స్థానిక స్వపరిపాలనను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కాకతప్పదు 

‘పరిపాలన వికేంద్రీకరణ–పారదర్శకత’ తీర్మానంపై చర్చలో స్పీకర్‌ తమ్మినేని  

(వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో ప్రతి గడపలోనూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరే వినిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ తిరిగి విజయం సాధించడం.. జగన్‌ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం తథ్యమని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోరే జగన్‌ ప్రభుత్వం ఉందని, అది గాంధీ కోరిన స్థానిక స్వపరిపాలన అందిస్తోందన్నారు.

గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు అందులో భాగమేనన్నారు. సీఎం జగన్‌ సంస్కరణలు ఓ తరానికి ఆదర్శమని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ రెండో రోజు శనివారం అశేష జనవాహిని హోరుతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘పరిపాలన వికేంద్రీకరణ–పారదర్శకత’ తీర్మానం మీద చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా స్పీకర్‌తోపాటు ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మాజీమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. 

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ విషాదాన్ని దిగమింగి అనేక అవమానాలను ఎదుర్కొని తన కుమారుడిని గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దడం దేశ చరిత్రలో మరువలేనిది. రాష్ట్రంలో సీఎం జగన్‌ ప్రజల కోసం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ఎల్లో మీడియా ఎందుకు రాయడంలేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. విద్యా, వైద్యానికి, సేద్యానికి పేదరికం అడ్డంకి కాకూడదని, పల్లెలకు కూడా అభివృద్ధి చేరాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎల్లో మీడియాకు కనిపించడంలేదా? అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు.

క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో వీటికి తెలియదు. గడప గడపకూ తిరుగుతున్న మాకు ప్రజల మనస్సు తెలుసు, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం.. జగన్‌ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం, టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం. ధర్మాన్ని కాపాడుతున్న సీఎం జగన్‌ను ఆ ధర్మమే కాపాడుతుంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో సంస్కరణలు, వికేంద్రీకరణ ఆగిపోతాయి. అసమానత్వం తొలగాలి.. పేదరికం పోవాలి.. ఇది జరగాలంటే జగన్‌ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించాలి.   

అంబేడ్కర్‌ ఆలోచనలను అమలుచేస్తున్న జగన్‌ 
అధికారం అంటే తాను మాత్రమే ఎదగడం, తన వర్గం వారు మాత్రమే బాగుపడడం అనుకునే స్వార్థపరుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా మోసాలు, అబద్ధాలతోనే కాలం గడిపారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందేలేదు. కానీ, ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ ఆలోచనలను అమలుచేస్తున్న నాయకుడు జగన్‌.  
– కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు 

ఈ విజయం సీఎం జగన్, కార్యకర్తలదే 
– పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి 
దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా.. సమైక్య పోరాటంతో అధికారంలోకి వచ్చిన గొప్ప చరిత్ర వైఎస్సార్‌సీపీది. మనం 13 ఏళ్లలో సాధించిన ఘనత మరే పార్టీకి లేదు. ఈ విజయానికి కారణం ఒకరు సీఎం వైఎస్‌ జగన్‌ అయితే.. మరొకరు పార్టీ కార్యకర్తలు. ఈ ప్లీనరీ జగన్‌ సైనికులకు పెద్ద పండగలాంటిది. దేశంలో సంక్షేమ ప్రభుత్వం ఎలా ఉండాలో 2004, 2009లో వైఎస్సార్‌ పరిచయం చేశారు. పారదర్శకత కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు ఆయన. వైఎస్సార్‌ సంకల్పాన్ని, ఆశయాలను సీఎం జగన్‌ నిజంచేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శనం. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.  

పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి 
– నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల 
రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకు అనవసరం. ఆయన, ఆయన వర్గం బాగుపడితే చాలనుకునే స్వార్థపరుడు. రాజధాని పేరుతో రైతుల పంటలను తగులబెట్టించి దుర్మార్గానికి పాల్పడ్డాడు. అధికారంలోకి రాగానే నూజివీడులో రాజధాని అని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా కారుచౌకగా తుళ్లూరులో తన వర్గీయులతో భూములు కొనిపించి తర్వాత పేదల భూములను బలవంతంగా లాక్కొన్నాడు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేమని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే చంద్రబాబు కుట్రలతో పంటలు తగలబెట్టించాడు. అభివృద్ధి అనేది ఒకేచోట కేంద్రీకృతం కారాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం మరోసారి జరగకూడదంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి. 

మరిన్ని వార్తలు