ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలం 

25 Feb, 2023 05:02 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు

పరిశ్రమలకు అనువైన పరిస్థితులు కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ముందుంది 

సగటున 12 రోజుల్లోనే అనుమతులు 

పరిశ్రమల కోసం 48వేల ఎకరాలు సిద్ధం 

హైదరాబాద్‌లో జీఐఎస్‌ రోడ్‌షోలో మంత్రులు రాజేంద్రనాధ్, అమర్‌నాథ్‌ 

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సుదీర్ఘ తీరప్రాంతం, పుష్కలమైన వనరులు, సుశిక్షితులైన మానవ వనరుల లభ్యత, వ్యాపారాలకు ప్రభుత్వ తోడ్పాటు తదితర సానుకూల అంశాలతో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యామ్నాయం మరేదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

సత్వరం అనుమతులు మంజూరు చేస్తూ వ్యాపారాలు, పరిశ్రమలకు  అనువైన పరిస్థితులు కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ముందుందని చెప్పా­రు. విశాఖ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్‌) 2023కు సంబంధించి హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన రోడ్‌ షోలో వారు మాట్లా­డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.

సుస్థిర అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిశ్రమలకు అవసరదమైన సకల మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి బుగ్గన వివరించారు. నిపుణుల కొరతను అధిగమించేందుకు నైపుణ్యాల్లో శిక్షణకు కూడా పెద్ద పీట వేస్తోందన్నారు. ఐటీ, బల్క్‌ డ్రగ్‌ పార్క్, పీసీపీఐఆర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెరైన్, వ్యవసాయం,  పునరుత్పాదకశక్తి వంటి రంగాలలో పెట్టుబడులకు ఏపీ అనుకూలమన్నారు. 

అనుమతుల సమయాన్ని కుదించాం 
రాష్ట్రంలో పరిశ్రమల కోసం 48వేల ఎకరాలకు పైగా స్థలం సిద్ధంగా ఉందని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు స్థలం కాకుండా సగటున 12 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్నాయని తెలిపారు. కొత్తగా తేబోయే పాలసీలో 21 రోజుల్లో స్థలాన్ని కూడా కేటాయించాలని భావిస్తున్నట్లు వివరించారు. 974 కి.మీ. సుదీర్ఘ తీర ప్రాంతం, 534 ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లు, 6 సెజ్‌లు, 3 ఐటీ సెజ్‌లు, 3 పారిశ్రామిక కారిడార్లు, రెండంకెల వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు పూర్తి అనుకూలమని పేర్కొన్నారు.

వైజాగ్‌ ఐటీ గమ్యస్థానంగా మారుతోందని తెలిపారు. పరిశ్రమలకు నీటి సరఫరా­కు గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభు­త్వ ప్రోత్సాహకాలతో వేలకొద్దీ చిన్న, మధ్య తరహా సంస్థలు ఏర్పాటవుతున్నాయని ఏపీటీపీసీ చైర్మన్‌ కె.రవిచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బాక్సైట్, మాంగనీస్‌ తదితర 48 రకాల ఖనిజాల లభ్యత పుష్కలంగా ఉందన్నారు. ఏపీలో అవకాశాలను తెలియజేసేందుకు, పారిశ్రామిక భాగస్వామ్యా­లు కుదుర్చుకునేందుకు జీఐఎస్‌ తోడ్పడుతుందని తెలంగాణ సీఐఐ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ రెడ్డి చెప్పారు. 

పారిశ్రామికవేత్తల హర్షం 
ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పారిశ్రామికవర్గాలు ప్రభుత్వ సహకారంపై సంతృప్తి వ్యక్తం చేశాయి. పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తోందని డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ ఎండీ డీవీఎస్‌ నారాయణ రాజు తెలిపారు. ఏపీలోని తమ ప్లాంటులో నీరు, విద్యుత్‌ కొరత లేదని చెప్పారు. విద్యుత్, ఇంధనం కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చౌకగా లభిస్తున్నాయన్నారు.

స్విచ్‌గేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ డైరెక్టర్‌ ఒ.జగన్నాథ్‌ మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటికే చిత్తూరు ఇండస్ట్రియల్‌ పార్క్‌లో కార్యకలాపాలు సాగిస్తోందని, మరో రూ.150 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పలు సబ్సిడీలు అందిస్తోందని, పరిశ్రమల నిర్వహణ సులభతరం చేసిందని వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, నైపుణ్యాల శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌ గౌర్, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి.సృజన, ఏపీ మారిటైం బోర్డు సీఈవో షన్‌ మోహన్, ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు