రాజరాజా.. ఎన్నాళ్లీ వివాదం!

28 Aug, 2022 04:26 IST|Sakshi
రాజరాజ నరేంద్రుని విగ్రహం

రాజరాజనరేంద్రుడి పట్టాభిషేకం తేదీపై భిన్నాభిప్రాయాలు 

వెయ్యేళ్లు అయినా కొరవడిన స్పష్టత 

వేర్వేరుగా సహస్రాబ్ది ఉత్సవాలు

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): తెలుగువారికి మహాభారతాన్ని సునాయాసంగా చదువుకునే అవకాశం కల్పించిన సాహితీ చక్రవర్తి రాజరాజనరేంద్రుడు. రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకుని క్రీ.శ.1022 నుంచి 32 ఏళ్లు పాలించిన ఆయన చరిత్ర వెయ్యేళ్లుగా తెలుగు ప్రజల హృదయాల్లో చెక్కుచెదరకుండా ఉంది. అయితే, గోదావరి తీరంలో రాజరాజనరేంద్రుని పట్టాభిషేకంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత కొరవడింది. కొందరు ఆగస్టు 16న పట్టాభిషేకం చేశారని, మరికొందరు ఆగస్టు 22న పట్టాభిషిక్తులయ్యారని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇతిహాసిక మండలి ఆధ్వర్యాన ప్రముఖ చరిత్ర పరిశోధకుడు భావరాజు వేంకట కృష్ణారావు సంపాదకత్వంలో వెలువడిన ‘శ్రీరాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక’లో రాజరాజ నరేంద్రుడు ఆగస్టు 16వ తేదీన పట్టాభిషిక్తుడయ్యారని ఉంది. ఈ సంచిక నేటికీ రాజమహేంద్రవరంలోని గౌతమి గ్రంథాలయంలో ఉంది. విశ్రాంత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రేజేటి వేణుగోపాలాచార్యులు, చరిత్ర పరిశోధకుడు వైఎస్‌ నరసింహారావు కూడా ఆగస్టు 16వ తేదీని బలపరిచారు.

అయితే, ఆగస్టు 22న పట్టాభిషేకం చేసినట్లు కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్‌ బీవీఎస్‌ మూర్తి ప్రకటించారు. ఇందుకు కొన్ని ఆధారాలను చెబుతున్నారు. సాహితీప్రియులు మాత్రం రాజరాజనరేంద్రుని పట్టాభిషేక ఉత్సవాలను వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా సహస్రాబ్ది ఉత్సవాలను రెండుసార్లు నిర్వహించారు. దీంతో అసలు పట్టాభిషేకం ఎప్పుడు చేశారనేది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మద్రాసు మ్యూజియంలో ఉన్న రాగిరేకుల శాసనాలు  

ఆగస్టు 16వ తేదీన పట్టాభిషిక్తుడయ్యారు 
‘రాజరాజనరేంద్రుడు వేయించిన ఐదు రాగిరేకుల శాసనాన్ని గోదావరి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఎపిగ్రఫిస్టు డాక్టర్‌ హల్జస్‌కు ఇవ్వగా, ఆయన దానిని మద్రాస్‌ మ్యూజియంలో ఉంచారు. ఆ తర్వాత డాక్టర్‌ కీల్హారన్‌ 1895లో ఈ శాసనాన్ని తెలుగులోకి అనువదించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్‌ పత్రిక సంపాదకుడు జయంతి రామయ్య 1912లో తన సంచికలో వాటి వివరాలను, రాగిరేకుల ఫొటోలను ముద్రించారు. దాని ప్రకారం రాజరాజుఆగస్టు 16వ తేదీన పట్టాభిషిక్తుడయ్యారు.’ 
 – డాక్టర్‌ ఆర్‌వీవీ గోపాలాచార్యులు, విశ్రాంత ఆచార్యులు, రాజమహేంద్రవరం 

ఆగస్టు 22నే పట్టాభిషేకం
‘తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన ఆంధ్రమహాభారతం, ఆదిపర్వానికి ముందుమాటలో రాజరాజుకు ఆగస్టు 22వ తేదీన పట్టాభిషేకం చేశారని సంపాదకులు పేర్కొన్నారు. ఏటా ఆగస్టు 22వ తేదీన తెలుగు భాషాభివృద్ధి సంస్థ, కళాగౌతమి ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకం మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.’  
 –  డాక్టర్‌ బీవీఎస్‌ మూర్తి, కళాగౌతమి సంస్థ వ్యవస్థాపకుడు 

మరిన్ని వార్తలు