అమరావతి రైల్వే లైన్‌కు నిధుల కేటాయింపుల్లేవు

10 Mar, 2021 05:09 IST|Sakshi

ఆర్‌వోఆర్‌ లేకపోవడమే ఇందుకు కారణం

నిర్మాణానికి చేసిన ఖర్చులో 12 శాతం రేట్‌ ఆఫ్‌ రిటర్న్స్‌ వస్తేనే ప్రాజెక్టు ముందుకు 

రైల్వే లైన్‌కు ఏడాదికి రూ.300 కోట్లు కూడా రావని ఆర్‌వీఎన్‌ఎల్‌ సర్వే

సాక్షి, అమరావతి: అమరావతికి నూతన రైలుమార్గం నిర్మించేందుకు రేట్‌ ఆఫ్‌ రిటర్న్స్‌ (ఆర్‌వోఆర్‌) లేనందునే ఈ ప్రాజెక్టు ఒక్కడుగు కూడా ముందుకు పడటం లేదు. ఈ రైల్వే లైన్‌ లాభసాటి కాదని రైల్వే బోర్డు తేల్చడంతోనే 2018 నుంచి కేటాయింపుల్లేవు. 2016లో రూ.3,272 కోట్లతో అమరావతి రైలుమార్గాన్ని కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. 106 కి.మీ. మేర ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు (56.8 కి.మీ.), అమరావతి–పెదకూరపాడు (24.5 కి.మీ.), సత్తెనపల్లి–నరసరావుపేట (25 కి.మీ.) మూడు మార్గాలు కలిపి 106 కి.మీ. నిర్మించాల్సి ఉంది. అయితే 2016లోనే 687 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా పట్టించుకోలేదు. ఆ తర్వాత రైల్వే శాఖ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. రూ.3 వేల కోట్లతో అమరావతికి కొత్త లైన్‌ ఏర్పాటు చేస్తే రైల్వే బోర్డు అంచనాల ప్రకారం.. ఏడాదికి సరుకు రవాణా, ప్రయాణికుల టిక్కెట్‌ ఆదాయంపై రూ.360 కోట్లు రైల్వేకు ఆదాయం రావాలి. అంటే అమరావతి రైల్వేలైన్‌పై పెట్టిన పెట్టుబడిలో 12 శాతం రేట్‌ ఆఫ్‌ రిటర్న్స్‌ (ఆర్‌వోఆర్‌) రావాలి. 

నాలుగేళ్ల క్రితమే సర్వే
అమరావతి రైల్వే లైన్‌పై ‘రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌)’ నాలుగేళ్ల క్రితమే సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. రూ.310.8 కోట్లు అంటే 10.36 శాతం ఆర్‌వోఆర్‌ వస్తుందని తేల్చింది. అయితే గతంలోనే దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్స్‌ విభాగం నిర్వహించిన అధ్యయనంలో అమరావతి రైల్వే లైన్‌పై ఆర్‌వోఆర్‌ 10.36 శాతం నుంచి ఇంకా పడిపోయినట్లు తేలింది. రాజధాని ప్రాంతంలో సరుకు రవాణాకు పరిశ్రమలు లేకపోవడం, ప్రయాణికులు రైలుమార్గం కంటే రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తేలడంతో ఇవే విషయాలను రైల్వే బోర్డుకు నివేదించారు. దీంతో  ప్రతిపాదనల్ని రైల్వే బోర్డు పక్కన పడేసింది. 2018, 2019లో ఈ మార్గానికి పైసా నిధులు కేటాయించని రైల్వే శాఖ ఇప్పుడు తమ తప్పేమీ లేదని పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ ఈ రైలు మార్గానికి కేవలం రూ.వెయ్యి కేటాయించారు.   

మరిన్ని వార్తలు