ఈ ఏడాదీ లోటు లేదు

22 Aug, 2022 03:10 IST|Sakshi
నిండుకుండలా అనంతపురం జిల్లా శింగనమల చెరువు

ఖరీఫ్‌లో కరువుదీరా వానలు.. 22 జిల్లాల్లో సాధారణ వర్షపాతం

సత్యసాయి, బాపట్ల, అనంతపురం, కాకినాడలో అధికం

వరసగా నాలుగో ఏడాదీ పంటలకు ఊరట 

సాక్షి, విశాఖపట్నం: వర్షాల కోసం రైతన్నలు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వరుణుడి కరుణతో ఈ ఏడాదీ నైరుతి రుతుపవనాలు ‘లోటు’ లేకుండా మేలు చేస్తున్నాయి. జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతూ రుతుపవనాల్లో చురుకుదనాన్ని పెంచి వానలకు కారణమవుతున్నాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో ఇప్పటివరకు ఐదు అల్పపీడనాలు, రెండు వాయుగుండాలు ఏర్పడ్డాయి.

ఇవి మోస్తరు నుంచి భారీ వర్షాలకు దోహదపడ్డాయి. దీంతో గత రెండు నెలల కాలంలో రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్‌) నివేదిక ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు రాష్ట్రంలో 370.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 379.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 2.4 శాతం అధికంగా వర్షం పడింది. 

సత్యసాయి జిల్లాలో అత్యధికంగా..
ఈ సీజనులో రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 19.7 శాతం తక్కువ వర్షం కురిసింది. బాపట్ల, కాకినాడ, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. సత్యసాయి జిల్లా 58.7 శాతం అధిక వర్షపాతంతో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కురిసిన జిల్లాగా మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో బాపట్ల (+51.3 శాతం), అనంతపురం (+34.3 శాతం), కాకినాడ (+21.1 శాతం) జిల్లాలున్నాయి. సాధారణం కంటే 20 శాతానికి పైగా వర్షపాతం తక్కువ నమోదైతే లోటు వర్షపాతంగా పరిగణిస్తారు. 

ఖరీఫ్‌కు ఢోకా లేదు..
నైరుతి రుతుపవనాల సీజన్‌ జూన్‌లో మొదలై సెప్టెంబర్‌తో ముగుస్తుంది. గత రెండు నెలలుగా ఎప్పటికప్పుడు వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రం మొత్తమ్మీద ఎక్కడా కరువు పరిస్థితులు ఏర్పడలేదు. ఇది రైతులకు ఎంతో ఊరట కలిగిస్తోంది. 40 రోజుల్లో నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగియనుంది. రానున్న రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది.

ఈదఫా నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. వరుసగా నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం, ఈ ఏడాదీ అదే పరిస్థితి కొనసాగుతుండడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఏడాది కూడా..
గత ఏడాది కూడా నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఆశాజనకంగానే వర్షాలు కురిశాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షపాతం 514.4 మిల్లీమీటర్లు కాగా 613.3 మిల్లీమీటర్ల వర్షం (19 శాతం అధికం) కురిసింది. ధాన్యలక్ష్మితో రైతన్నల లోగిళ్లు కళకళలాడాయి. 

మరిన్ని వార్తలు