AP: రైతులు పైసా చెల్లించక్కర్లేదు

30 Jun, 2022 04:27 IST|Sakshi

ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంపై అపోహలొద్దు

రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ ప్రభుత్వ లక్ష్యం

దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్‌ ఎనర్జీ మీటర్లు

మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా, చోరీకి గురైనా విద్యుత్‌ కంపెనీలదే బాధ్యత

‘సాక్షి’తో విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు

సాక్షి, అమరావతి: రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంపై ప్రజల్లో అనేక అపోహలు సృష్టించేందుకు కొందరు అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు.. కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, హెచ్‌.హరనాథరావు మండిపడ్డారు. సర్వీసులు తొలగిస్తారని, బిల్లులు వసూలు చేస్తారని తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన డిస్కంల సీఎండీలు ఉచిత విద్యుత్‌ పథకం వల్ల ఏ ఒక్క విద్యుత్‌ సర్వీసునూ తొలగించబోమని, ఒకరి పేరు మీద ఎన్ని సర్వీసులున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేస్తున్నారు. సీఎండీలు ఇంకా ఏమన్నారంటే..

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ పొందే హక్కు..
రాష్ట్రంలో దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్‌ ఎనర్జీ మీటర్లను అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికయ్యే ఖర్చును సబ్సిడీగా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా చెల్లించనవసరం లేదు. ప్రస్తుతం రైతుల పేరిట ఉన్న బ్యాంక్‌ ఖాతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొత్త ఖాతాలు తెరిపిస్తుంది. వినియోగం ఆధారంగా వ్యవసాయ సబ్సిడీ మొత్తాన్ని ఖాతాలకు జమ చేస్తుంది.

ఆ తర్వాత ఆ మొత్తం విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు బదిలీ అవుతుంది. దీంతో నాణ్యమైన విద్యుత్‌ను పొందే హక్కు రైతులకు లభిస్తుంది. బిల్లులు సకాలంలో చెల్లించలేకపోయినా రైతులకు విద్యుత్‌ సరఫరాను నిరాటంకంగా అందించాలని, కనెక్షన్లు తొలగించకూడదని ప్రభుత్వం స్పష్టంగా విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది. కౌలు రైతులు కూడా యథావిధిగా ఉచిత విద్యుత్‌ పొందొచ్చు.

నిరంతర విద్యుత్‌ సరఫరాకే మీటర్ల అమరిక
ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నా, సబ్‌ స్టేషన్లపై లోడ్‌ ఎక్కువై లోఓల్టేజ్‌ సమస్య రాకుండా ఉండాలన్నా, రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరగాలన్నా మీటర్లు అమర్చాలి. మీటరు బిగించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం, మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా, దొంగతనానికి గురైనా, మరమ్మతు ఖర్చులు మొత్తం విద్యుత్‌ కంపెనీలు భరిస్తాయి. 

ఏ ఒక్క సర్వీసునూ తొలగించరు..
ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క విద్యుత్‌ సర్వీసునూ తొలగించరు. ఒక వినియోగదారుడి పేరిట ఇన్ని కనెక్షన్లే ఉండాలనే నిబంధన ఏదీ లేదు. ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్ల పేరు మార్చుకోవాలన్నా చేసుకోవచ్చు. అనధికార, అదనపు లోడు కనెక్షన్లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అవి కూడా వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంలోకి వస్తాయి. పేర్ల మార్పు ప్రక్రియ కోసం, బ్యాంకు ఖాతాలు తెరవడానికి రైతులు ఎవరి దగ్గరకూ వెళ్లనవసరం లేదు. డిస్కం, గ్రామ సచివాలయ సిబ్బందే రైతుల వద్దకు వచ్చి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు.

రైతులకు విద్యుత్‌ షాకులు ఉండవు
మీటర్‌ రీడింగ్‌ కోసం మోటారు దగ్గరకు లైన్‌మెన్లు రావడం వల్ల విద్యుత్‌ సమస్య ఏదైనా ఉంటే అతడి దృష్టికి తెచ్చి తక్షణమే పరిష్కరించుకోవచ్చు. రీడింగ్‌ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని తెలుసుకుని మెరుగుపరుచుకోవచ్చు. ఎంత లోడు వాడుతున్నారో ఖచ్చితంగా తెలియడం వల్ల ఆ మేరకు విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పటిష్టం చేసుకోవచ్చు. అనధికార కనెక్షన్లు ఉండవు. ఎర్త్‌ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం వల్ల రైతులు విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చు. 

మరిన్ని వార్తలు