ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్‌ లేదు

4 May, 2021 03:53 IST|Sakshi

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ప్రస్తుతమున్న స్ట్రెయిన్‌ గతేడాది జూలై నుంచే రాష్ట్రంలో ఉందన్నారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కూడా కొత్త స్ట్రెయిన్‌ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త స్ట్రెయిన్‌ వల్లే కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయనడం సరికాదన్నారు. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను పాటిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్‌ సింఘాల్‌ ఇంకేమన్నారంటే.. 

24 గంటల్లో 1,15,275 పరీక్షలు..
రాష్ట్రంలో 24 గంటల్లో 1,15,275 కరోనా పరీక్షలు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 447 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను వినియోగించాం. రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఆక్సిజన్‌ స్టోరేజ్, రవాణాకు కావాల్సిన క్రయోజనిక్‌ ట్యాంకర్లు, ఇతర పరికరాల కొనుగోలుపై చర్చించాం. అన్ని బోధన, ప్రభుత్వాస్పత్రుల్లో పీఎస్‌ఏ (ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్ప్‌షన్‌) ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాం. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, పైప్‌లైన్ల కొనుగోలుకు మూడు నాలుగు రోజుల్లో టెండర్లు ఖరారు చేస్తాం. 

అత్యవసర సర్వీసులకు మినహాయింపు
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు వ్యాపారాలకు, సాధారణ జీవనానికి ఎటువంటి ఆటంకాలు, ఆంక్షలు ఉండవు. ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువమంది గుమికూడకుండా ఉదయం వేళల్లో144 సెక్షన్‌ అమలు చేస్తాం. నిత్యావసరాలు, ఇతర సరుకులు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. వైద్య సేవలు, అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపులుంటాయి. మీడియా, ఉద్యోగులకు కూడా ఎటువంటి ఆటంకం ఉండదు. 

45 ఏళ్లు పైబడినవారికే ప్రాధాన్యత
టీకా పంపిణీలో 45 ఏళ్లకు పైబడిన వారికే ప్రాధాన్యత ఉంటుంది. 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.

 

మరిన్ని వార్తలు