ఆందోళన వద్దు.. ప్రభుత్వం అండగా ఉంది

29 Apr, 2021 03:45 IST|Sakshi
కరోనా కట్టడిపై సమీక్షలో మాట్లాడుతున్న ఆళ్ల నాని, పక్కన ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు, డీజీపీ

ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ కొరత లేదు

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 37 వేల పడకలు

మంత్రుల కమిటీ భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 37 వేల పడకలు సిద్ధం చేశామని తెలిపారు. కరోనా కట్టడిపై మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో బుధవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. అనంతరం మంత్రి అప్పలరాజుతో కలిసి ఆళ్ల నాని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత లేదని చెప్పారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో అవసరాన్ని బట్టి పడకలు పెంచుతున్నట్లు చెప్పారు.

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. 104 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేశామని, దీనివల్ల ప్రతి ఒక్కరికీ సమస్య పరిష్కారం కావాలనేది సీఎం జగన్‌ ఆశయమన్నారు. కరోనా మేనేజ్‌మెంట్‌ పకడ్బందీగా జరుగుతోందన్నారు. బాధితులను తరలించడానికి 108 వాహనాలను వాడుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 62 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్‌కు గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది సేవల్ని ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. ఒకేరోజు 6 లక్షలమందికి పైగా వ్యాక్సిన్‌ వేసిన ఘనత మన రాష్ట్రానిదేనని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి ఓవైపు ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆయన ప్రజల గురించి ఆలోచించే వారైతే 2019 ఎన్నికల్లో అంత ఘోర పరాభవం ఎదుర్కొనేవారు కాదని మంత్రి నాని పేర్కొన్నారు. మంత్రుల కమిటీ సమావేశంలో బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, సీదిరి అప్పలరాజు, బుగ్గన రాజేంద్రనాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు