స్వర్ణ ప్యాలెస్‌ రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తం

12 Aug, 2020 04:07 IST|Sakshi

నిర్మాణంలో నిబంధనలు తుంగలోకి 

నివాస భవనానికి అనుమతులు తీసుకుని.. హోటల్‌ వ్యాపారం 

అగ్నిప్రమాదం జరగకుండా నిరోధించే ఒక్క పరికరమూ లేదు 

స్మోక్‌ డిటెక్టర్లు, అలారం,ఎమర్జెన్సీ లైట్లూ లేవు 

అత్యవసర మార్గాన్ని చెక్కతో మూసేసిన యాజమాన్యం 

ప్రమాదం జరిగినప్పుడు రిసెప్షన్‌లో ఒక్కరూ లేని వైనం

సాక్షి, అమరావతి బ్యూరో: అగ్నిప్రమాదం సంభవిస్తే దాన్ని నివారించే రక్షణ వ్యవస్థ లేకపోవడం, హోటల్‌ నిర్మాణం నిబంధనల మేరకు లేకపోవడం వల్లే విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ ఘటనకు కారణాలని అధికారులు నిర్ధారించారు. వీటితోపాటు హోటల్‌లో నిర్వహిస్తున్న కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణలోనూ అవకతవకలు జరిగినట్లు తేలింది. అలాగే హోటల్‌లో అమర్చిన విద్యుత్‌ పరికరాల్లో కూడా నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపించిందని తెలుస్తోంది. ఈ మేరకు ఘటనపై విచారణ చేస్తున్న అధికార బృందాల దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. గత రెండు రోజులుగా ఘటనా స్థలంలో వివిధ కోణాల్లో అధ్యయనం చేసిన అగ్నిమాపక, విద్యుత్‌ శాఖల ఆధ్వర్యంలోని కమిటీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈవో ఆధ్వర్యంలోని కమిటీ, కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ నివేదికలు సమర్పించనున్నాయి. 

ఫైర్‌ సేఫ్టీ పరికరాలు నిల్‌.. 
► స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోలేదు.
► అగ్నిమాపక భద్రతకు అవసరమైన పరికరాలేవీ హోటల్‌లో లేవు.  
► పైపులు ఉన్నా వాటికి వాటర్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు.ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే స్మోక్‌ డిటెక్టర్లు, అలారం వ్యవస్థ, ఎమర్జెన్సీ లైట్లూ లేవు. 
► మంటలు ఆర్పే వాటర్‌ స్ప్రింక్లర్లు, మోటార్లు ఉన్నా వాటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు.  
► హోటల్‌ రిసెప్షన్, రూముల్లో ఫాల్‌సీలింగ్, చెక్కతో నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి ఇవే ప్రధాన కారణం.  
► అత్యవసర మార్గం ఉన్నా ఉపయోగం లేకుండా దాన్ని చెక్క తలుపుతో మూసి ఉంచారు.  
► భవనంలో ఉన్న మెట్ల మార్గం సైతం ఇరుకిరుకుగానే ఉంది.   
► మొదట ప్రమాదం చోటు చేసుకున్న రిసెప్షన్‌ పక్కనే బ్యాటరీలు, ఇతర విద్యుత్‌ పరికరాలు ఉన్నాయి. ప్రమాద తీవ్రత అక్కడే ఎక్కువగా ఉండటంతో ఆ ఫ్లోర్‌లో వైరింగ్‌ అంతా కరిగిపోయింది.  

రోగుల భద్రత గాలికి.. రిసెప్షన్‌లో ఎవరూ లేని వైనం 
► రోగుల భద్రత విషయంలో ఆస్పత్రి యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగినప్పుడు హోటల్‌ రిసెప్షన్‌లో ఎవరూ లేరు.  
► రోగులు రిసెప్షన్‌కు ఫోన్‌ చేసి ఏదైనా సహాయం అడిగితే చేయడానికి రిసెప్షన్‌తో సహా ఆ ఫ్లోర్‌ మొత్తంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు.
► రిసెప్షన్‌ వద్ద ప్రమాదం జరిగి మంటలు పై అంతస్తులకు వ్యాపించినా అప్రమత్తం చేసేవారే లేరు. 

మరిన్ని వార్తలు