షెడ్యూల్‌ ప్రకారమే ‘పది’ పరీక్షలు

1 May, 2022 03:26 IST|Sakshi

పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పులుండవు

విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దు 

పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తున్నాం

ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి షేర్‌ చేసేవారిపై కఠిన చర్యలు

ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 9 వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కాబట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపేవారిపైన, వాటిని షేర్‌ చేసేవారిపైన కేసులు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో లేదా ఇతర మార్గాల్లో ఎవరికైనా వస్తే పోలీసులకు లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా, మండల విద్యాశాఖాధికారులు కూడా ప్రశ్నపత్రాలు షేర్‌ చేస్తున్నవారి నంబర్లను పోలీసులకు తెలియజేయాలన్నారు.

మీడియా కూడా ఇందుకు సహకరించాలని కోరారు. పరీక్ష కేంద్రంలో డ్యూటీలో ఉన్నవారు కాకుండా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఉంటే చీఫ్‌ సూపరింటెండెంట్లదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ పరీక్షలు పూర్తయ్యాయన్నారు. ఇంకా మ్యాథ్స్, ఫిజికల్‌ సైన్స్, బయోలాజికల్‌ సైన్స్, సోషల్‌ స్టడీస్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉందన్నారు. రంజాన్‌ను ఏ తేదీన జరుపుకుంటున్నప్పటికీ మిగిలిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రానికి దగ్గరగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరుస్తున్నామని తెలిపారు. పరీక్ష సమయానికి కేవలం గంట ముందు మాత్రమే పోలీస్‌ స్టేషన్‌ నుంచి పకడ్బందీగా పరీక్ష కేంద్రాలకు చేరుస్తున్నామని పేర్కొన్నారు. 

పరీక్షల చట్టం ప్రకారం కేసులు..
పరీక్ష ప్రారంభమయ్యాక కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం పరీక్ష కేంద్రాల్లో పనిచేసే ఒకరిద్దరు సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాలను ఫోన్‌తో ఫొటో తీసి వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఫోన్‌ను తప్ప మిగిలినవారి ఫోన్లను లోపలికి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నా ఇలా చేస్తున్నారని చెప్పారు. ప్రశ్నపత్రాలను షేర్‌ చేసేవారిపై పరీక్షల చట్టం 25/97 ప్రకారం కేసులు నమోదు చేశామని తెలిపారు. నంద్యాల జిల్లాలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేయగా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో ఇద్దరిని సస్పెండ్‌ చేయడంతోపాటు ఏడుగురిని, సత్యసాయి జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. 

టీడీపీకి పరీక్షలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి బొత్స
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరీక్షలపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. పేపర్ల లీకేజీ, కాపీయింగ్‌ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు మంత్రి బొత్స శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. చిత్తూరులో టీడీపీ మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల సిబ్బందితో సహా మాల్‌ ప్రాక్టీసుకు ప్రయత్నించిన ఏడుగురిని అరెస్టు చేశామని తెలిపారు.

నంద్యాలలో కూడా పలువురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రశ్నపత్రాలు బయట మార్కెట్‌లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తూ దొరికిపోయిన టీడీపీ నేతకు చెందిన నారాయణ, తదితర విద్యా సంస్థల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీడీపీకి చెందినవారు అక్రమాలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తూ.. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు అచ్చెన్నాయుడుకు ఉందా? అని నిలదీశారు.   

మరిన్ని వార్తలు