Third Gender: ‘ఎట్లానో చావండి. మీ ఒంట్లో ఏం జరుగుతోందో మా కంట్లో పడనివ్వకండి’

27 Jun, 2022 14:50 IST|Sakshi
వర్షంలో ప్రైడ్‌ వాక్‌ను ప్రారంభిస్తున్న శైలజ

స్వలింగ సంపర్కులు, థర్డ్‌ జండర్స్‌ ప్రైడ్‌ వాక్‌

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఎస్‌... ఐ యామ్‌ గే. సిగ్గెందుకు.. చెప్పుకోడానికి?! నేను అబ్బాయిని. కానీ అమ్మాయిలకు ఎట్రాక్ట్‌ కాను. ఇందులో తప్పేముంది? నేను అమ్మాయిని. కానీ అబ్బాయిలు నన్ను ఎట్రాక్ట్‌ చెయ్యలేరు. ఇందులో ఒప్పుకానిది ఏముంది? ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా అంటుంది లోకం. ప్రకృతి ఒక్కటేనా ధర్మం? ప్రకృతి విరుద్ధ ధర్మాలు ఉండవా?! అబ్బాయిల దగ్గర మాత్రమే కంఫర్ట్‌ ఫీలయ్యే అబ్బాయిలు, అమ్మాయిల ఆలింగనాలలో మాత్రమే ఆలంబన పొందే అమ్మాయిలు అడుగుతున్న ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? లేదు.

సానుభూతి ఉందా? లేదు. సహానుభూతి ఉందా? అదెలాగూ ఉండదు. సాఫ్ట్‌ కార్నర్‌ ఉందా? ఎప్పటికైనా ఏర్పడుతుందేమో తెలీదు. మరేముంది? అభ్యంతరం ఉంది. అసహనం ఉంది. అవహేళన ఉంది. ‘ఎట్లానో చావండి. మీ ఒంట్లో ఏం జరుగుతోందో మా కంట్లో పడనివ్వకండి’ అని దూరంగా జరిగిపోయేంత ఈసడింపు ఉంది. ‘గే’ స్‌ హర్ట్‌ అవుతున్నారు. నేచురల్‌ బాధ అనేది సాధారణ జెండర్‌లకు ఉండి, ట్రాన్స్‌జెండర్‌లకు లేకుండా పోతుందా?! ఎవరైనా మనుషులే కదా. బాధ పడతారు. అయితే వారి బాధ.. వాళ్లని మనం గుర్తించడం లేదని కాదు.

వాళ్లని మనం గౌరవించడం లేదని కాదు.  మరి? వాళ్లేమిటో వాళ్లని చెప్పుకోనివ్వడం లేదని! మగదీరుడిగా నిన్ను నువ్వు ఎగ్జిబిట్‌ చేసుకుంటావు. కోమలాంగిగా నిన్ను నువ్వు రిప్రెజెంట్‌ చేసుకుంటావు. మరి గే గా నన్నెందుకు బయట పడనివ్వవు అని నేస్తం సంస్థ ప్రతినిధులు నిగ్గుదీసి నిలదీస్తున్నారు. ఇది నేను..నాలా‘గే’ ఉంటానని థర్డ్‌జెండర్స్‌ బీచ్‌ రోడ్డులో గర్వంగా ప్రైడ్‌వాక్‌ వాక్‌ చేశారు. 

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. మేమూ సాధారణ వ్యక్తులమే..మాకూ హక్కులున్నాయి. మమ్మల్నీ గౌరవించండంటూ నేస్తం సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్‌ క్వీర్‌ ఆత్మాభిమాన్‌ యాత్ర పేరుతో ప్రైడ్‌ వాక్‌ ను ఆదివారం నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహం నుంచి ఆర్కేబీచ్‌ వరకు సాగిన ఈ వాక్‌ను జిల్లా హెచ్‌ఐవీ నియంత్రణ ప్రొగ్రాం మేనేజర్‌ శైలాజ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలు ప్రతి ఒక్కరికి నచ్చినట్టు జీవించే హక్కును కల్పించాయన్నారు. ఎవరి హక్కులను మనం వ్యతిరేకించారదన్నారు. థర్డ్‌జెండర్, స్వలింగ సంపర్కులపై వివక్ష చూపించడం సరైంది కాదన్నారు. వారు కూడా మనలో ఒకరిగా మనం గుర్తించి వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. ఈ వాక్‌కు పలు ఎన్జీవోలు, కాలేజీ విద్యార్థులు మద్దతిచ్చారు. 

రాష్ట్రంలో మొదటి ప్రైడ్‌ వాక్‌.. 
స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్‌ వారి హక్కుల కోసం రాష్ట్రంలో మొదటి సారిగా విశాఖలో ప్రైడ్‌ వాక్‌ను నిర్వహించినట్టు నిర్వహకులు తెలిపారు. ఈ వాక్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొందరు పాల్గొన్నారు. తమపై వివక్ష పూర్తిగా పోయే వరకు ఇటువంటి వాక్‌లను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు.

ఇది తొలి మెట్టు.. 
ఇంత భారీ వర్షంలో కూడా అనేక మంది వచ్చిన ఈ ప్రైడ్‌ వాక్‌లో పాల్గొనడం తొలిమెట్టుగా భావిస్తున్నాం. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్‌ హక్కుల కోసం రాష్ట్రంలో తొలి సరిగా నిర్వహించిన ఈ వాక్‌కు ఎన్జీవోలు, విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్‌పై ప్రజలు చూపిస్తున్న వివక్ష పోయే వరకూ పోరాటం ఆగదు. 
– విశ్వతేజ్, రాష్ట్ర స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త 

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి 
మా సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇందుకు కోసం ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సరిగా మా ఆత్మ గౌవరం కోసం ఎంతో ధైర్యంతో  ప్రైడ్‌ వాక్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వాక్‌ ద్వారా ప్రజల్లో ప్రేరణ వస్తుందని ఆశిస్తున్నాను. అందరితో పాటు మాకు సమాన హక్కులున్నాయని ప్రజలు గుర్తించాలి.
– కృష్ణమ్మ, హైదరాబాద్‌

హక్కుల కోసం ఒకే వేదికపై.. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్స్‌ అంతా ఒకే వేదికపైకి వచ్చి  హక్కుల కోసం మొదటి సరిగా ప్రైడ్‌ వాక్‌ నిర్వహించడం చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మా హక్కులను హరించవద్దని కోరుతున్నా. మాపై వివక్ష చూపించకుండా అందరిలానే సమానంగా చూడాలని కోరుకుంటున్నా. 
నందిత, ట్రాన్స్‌ మహిళ

మేము మానసిక రోగులం కాదు 
ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి నచ్చడం, అబ్బాయికి అబ్బాయి నచ్చడం మానసిక రోగం కాదు. సుప్రీం కోర్టు కూడా ఇంటువంటి ఆలోచనలు కలిగిన వారిని కాన్వర్‌జేషన్‌ థెరిపీ చేయటం నిషేధించింది. నేను ఈ వాక్‌ ద్వారా స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్‌ ఎదుర్కొంటున్న వివక్షకు గురవుతున్నవారి బాధలు తెలుసుకున్నా.  
– భావ్య, క్వీర్‌ పర్సన్‌ 

మరిన్ని వార్తలు