29న మూడో విడత ‘వైఎస్సార్‌ రైతు భరోసా’

19 Dec, 2020 10:48 IST|Sakshi

ఇకపై పంట నష్టానికి నెలలోపే పరిహారం చెల్లింపు

రాష్ట్ర మంత్రి మండలి భేటీలో నిర్ణయాలు

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ రైతు భరోసా మూడో విడత అమలుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 29న రాష్ట్రంలో 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009 కోట్లు నేరుగా జమ చేస్తారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం 50.47 లక్షల మంది రైతులకు రూ.1,009 కోట్లు చెల్లించనుంది. ఇదివరకే వైఎస్సార్‌ రైతు భరోసా కింద రెండు విడతల్లో ఒక్కో రైతు ఖాతాలో రూ.11,500 చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: సీఎం జగన్‌కు మెగాస్టార్‌ కృతజ్ఞతలు

ఏ సీజన్‌ పంట నష్ట పరిహారం అదే సీజన్‌లో చెల్లింపు
► ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో చెల్లించాలని నిర్ణయించారు. పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి నెల రోజుల్లోనే పరిహారం చెల్లిస్తారు. 
► ఈ ఏడాది నవంబర్‌ 24–29 మధ్య వచ్చిన నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు డిసెంబర్‌ 29న ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేస్తారు. 
►  నివర్‌ తుపానుతో 8,06,504 మంది రైతులకు చెందిన 13.01 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ రైతులకు ఈ నెల 29న ప్రభుత్వం రూ.718 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తుంది. 

పర్యాటకం పుంజుకునేలా..
►  పర్యాటక రంగంలో భారీ పెట్టుడులను ఆహ్వానించేలా, అందుకు తగిన సంస్థలను ప్రోత్సహించే దిశగా కొత్త పాలసీని రూపొందించారు. కొత్తగా వచ్చే టూరిజం యూనిట్లకు నెట్‌ ఎస్జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు.
► స్టాంపు డ్యూటీలో 100% రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తారు. భూ వినియోగ మార్పిడి చార్జీలు 100% మాఫీ చేస్తారు. ఐదేళ్లపాటు యూనిట్‌ విద్యుత్‌ రూ.2కే ఇస్తారు. 
►  రూ.400 కోట్లు పెట్టుబడి పెడితే దాన్ని మెగా టూరిజం ప్రాజెక్ట్‌గా పరిగణిస్తారు. మెగా టూరిజం ప్రాజెక్టులలో ఫైవ్‌ స్టార్‌ పైబడి హోదా ఉన్న వారు భాగస్వాములుగా ఉండాలి.   అందుకోసం మెగా టూరిజం ప్రాజెక్టులకు లీజు కాలాన్ని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడిగించారు. 

చింతలపూడి ఎత్తిపోతలకు నాబార్డ్‌ రుణం
► పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కృష్ణా జిల్లాకు కొంత మేర ప్రయోజనం చేకూర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డ్‌ నుంచి రూ.1,931 కోట్ల రుణ సేకరణకు అనుమతిచ్చారు. 
► పులివెందుల బ్రాంచ్‌ కెనాల్, సీబీఆర్‌ రైట్‌ కెనాల్‌ రెండో దశ కింద మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆరు జిల్లాల్లో రివార్డ్‌ కార్యక్రమం కింద వాటర్‌షెడ్ల అభివృద్ధికి ఆమోదం తెలిపారు. 

ఏపీఎంఈఆర్‌సీ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ 
► ‘ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఈఆర్‌సీ)’ ఏర్పాటు కోసం ఆర్డినెన్స్‌ జారీకి మంత్రి మండలి ఆమోదించింది. 
► ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలలు, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మరో 16 వైద్య కళాశాలలతోపాటు అన్ని నర్సింగ్‌ కళాశాలలను బలోపేతం చేసేందుకు ఏపీఎంఈఆర్‌సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

పలు కీలక నిర్ణయాలు ఇలా..
►  పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్‌ విధానంలో 147 ల్యాబ్‌ టెక్నీషియన్, 147 ల్యాబ్‌ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదించింది. నియోజకవర్గాల స్థాయిలో పశు వ్యాధి నిర్ధారణకు పరీక్షా కేంద్రాల్లో వీరిని నియమిస్తారు.
8పులివెందులలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌(ఇర్మా)–ఏపీ’ ఏర్పాటుకు ఆమోదించారు. రూ.83.59 కోట్లతో ఏర్పాటయ్యే ‘ఇర్మా–ఏపీ’కి ఈ నెల 24న శంకుస్థాపన చేయనున్నారు. ఈ సంస్థ ద్వారా గ్రామీణ మహిళలు, యువతలో సాధికారతను పెంచేలా కార్యక్రమాలు, కోర్సులు అందిస్తారు. 2021 మే, జూన్‌ నుంచి సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభిస్తారు. 
► చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్‌ మండలంలోని చెన్నయ్యగుంటలో ప్రభుత్వం నెలకొల్పనున్న ‘సర్వే శిక్షణ కాలేజీ’ కోసం 41.19 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
► ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం చినపావనిలో నెలకొల్పనున్న ‘పప్పు దినుసులు, తృణ ధాన్యాల పరిశోధన కేంద్రం’ కోసం 410.30 ఎకరాలను ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి అప్పగించేలా నిర్ణయించారు. 
►  కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల వద్ద 11.83 ఎకరాల భూమిని అటవీ శాఖకు అప్పగించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 
► డిసెంబర్‌ 21 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర భూ సర్వేకు ఆమోదం తెలుపుతూ.. అందుకోసం 1923 నాటి ‘ఆంధ్రప్రదేశ్‌ సర్వే, బౌండరీల చట్టం’లో కొన్ని సవరణలకు అనుమతించింది. 
►  రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా జాస్తి నాగభూషణ్‌ నియామకాన్ని ఆమోదించారు. 

చంద్రబాబు ప్రయోజనం కోసం నిమ్మగడ్డ ఆరాటం
కరోనా వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎలా చెబుతారు? రాష్ట్రంలో నివసించని ఆయనకు ఇక్కడ పరిస్థితులు ఎలా తెలుస్తాయి? రాష్ట్రంలో కాకుండా ఎక్కడో ఉంటూ నిమ్మగడ్డ ఇక్కడ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. చంద్రబాబు, సుజనా చౌదరి రాజకీయ ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నారు. మూడు రాజధానుల అంశంపై రిఫరెండం నిర్వహించాలన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్‌ అర్థం లేనిది. అమరావతి ముసుగులో చంద్రబాబు రైతులను మోసగించి యథేచ్ఛగా అవినీతికి పాల్పడి రాష్ట్రానికి ఇంతవరకు సరైన రాజధాని లేకుండా చేశారు. ఈ ప్రభుత్వం రాజధానిని మార్చడం లేదు. శాసనాలు చేసే అత్యున్నత వ్యవస్థ శాసనసభ అమరావతిలోనే ఉంటుంది.
– మంత్రి పేర్ని నాని  
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు