శ్రీవారికి తిరుప్పావై నివేదన

18 Dec, 2022 05:29 IST|Sakshi

తిరుమల/తిరుపతి కల్చరల్‌: ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది. పవిత్ర ధనుర్మాసం సందర్భంగా పెద్దజీయర్‌ మఠంలో తిరుప్పావై పారాయణం ప్రారంభమైంది. పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌ స్వామి పాల్గొన్నారు. 

వేదాల సారమే తిరుప్పావై 
వేదాల సారమే తిరుప్పావై అని తిరుమల చిన్నజీయర్‌స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్‌ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ప్రవచన కర్త చక్రవర్తి రంగనాథన్‌స్వామి ధనుర్మాసం గురించి వివరించారు. శ్వేత డైరెక్టర్‌ ప్రశాంతి, హెచ్‌డీపీపీ ఏఈవో సత్యనారాయణ, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్ట్‌ ప్రోగ్రాం అధికారి పురుషోత్తం పాల్గొన్నారు. 

శ్రీవారి దర్శనానికి 14 గంటలు 
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు ఒకటి నిండింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 48,928 మంది స్వామి వారిని దర్శించుకోగా, 23,322 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు 14 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.  

మరిన్ని వార్తలు