తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు

2 Sep, 2022 16:40 IST|Sakshi

అమీనాబాద్‌లో చురుగ్గా హార్బర్‌ నిర్మాణం

10 ఆక్వా శుద్ధి ప్లాంట్‌లలో ఉత్పత్తి ప్రారంభం

తాజాగా రూ.6,940 కోట్లతో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌  

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రతీరాన పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. విశాఖ సరిహద్దు కాకినాడ జిల్లా తొండంగి మండలం మొదలు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకూ గల తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సహజ వనరులకు లోటు లేని తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెట్రో, పెట్రో ఆధారిత పరిశ్రమలు, ఔషధాలు, బొమ్మలు తయారీ, కాకినాడ గేట్‌వే పోర్టు, వంట నూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్‌లు, హేచరీలు, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌...ఇలా పలు పరిశ్రమలు 120 కిలోమీటర్లు సముద్ర తీరంలో ఏర్పాటవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. 


వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కోవిడ్‌–19 మహమ్మారితో మొదటి రెండేళ్లూ గడచిపోయాయి. ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తిలేక మందగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే సమయం సరిపోయింది.  కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడానికి వీలు కాని పరిస్థితి. కోవిడ్‌ నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సరళీకరించిన పారిశ్రామికీకరణ విధానాలు దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షిస్తున్నాయి. సీఎం దూరదృష్టితో తూర్పు తీరంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక పోకస్‌ పెట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత ఏ జిల్లాకు ఆ జిల్లా పారిశ్రామిక ప్రగతికి ప్రణాళికలతో ముందుకు కదులుతున్నాయి. 


పారిశ్రామిక కారిడార్‌కు ఊతం 

తీరంలో గతంలో ప్రతిపాదించిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ప్రభుత్వ విధానాలు ఊతమిస్తున్నాయి. కారిడార్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా స్థానం ఉండటం పారిశ్రామికీకరణకు సానుకూలమవుతోంది. గత పాలకుల హయాంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూ సేకరణను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో చక్కదిద్దుతున్నారు. మరోపక్క కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బలవంతంగా సేకరించిన భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయడమనే ప్రక్రియ దేశంలోనే  తొలిసారి కాకినాడ సెజ్‌లో ప్రారంభమైంది. సీఎం సాహసోపేతమైన తాజా నిర్ణయంతో తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తున్నారు.     


కాకినాడ తీరంలో ఒక వెలుగు 

ఆదిత్యబిర్లా, అరవిందో వంటి పారిశ్రామక దిగ్గజాలు తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొండంగి మండలం కేపీ పురం–కోదాడ మధ్య బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీపడినప్పటికీ రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదించడం, అదీ కూడా మన కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలోనే  ఈ ప్రాజెక్టు లభించడం శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పార్క్‌ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ పార్కులో రూ.46,400 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతూ సుమారు 15వేల మంది యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలోనే ఫార్మా రంగంలో కాకినాడ తీరం ఒక వెలుగు వెలగనుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 


చురుగ్గా మేజర్‌ హార్బర్‌ పనులు 

కాకినాడ తీరంలో ఉప్పాడలో మినీ హార్బర్‌ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. ఆయన హఠాన్మరణం తరువాత పాలకులు ఐదేళ్లపాటు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్‌ మినీ హార్బర్‌ స్థానే మేజర్‌ హార్బర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ పనులు తీరంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.422 కోట్లు కేటాయించారు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 25 గ్రామాల్లో 50 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్థి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సముద్ర వేటపై ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మత్స్యకారులు ఇంతవరకు వేటాడాక బోటు నిలపడానికి సరైన హార్బర్‌ కూడా ఉండేది కాదు. ఈ సమస్యను ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్రలో గుర్తించారు. 2,500 బోట్లు వేటాడాక సరుకును దించేందుకు హార్బర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుబంధంగా మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం హార్బర్‌ సమీపాన 980 టన్నులతో గిడ్డంగులు, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్‌ప్లాంట్‌లు కూడా సిద్ధవమతున్నాయి. 


తీరం వెంబడి... 

► తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర తీర ప్రాంత మండలాల్లో సుమారు 20 రొయ్యల శుద్ధి కర్మాగారాలు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కర్మాగారాల్లో 10 నుంచి 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. 

► అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం భలభద్రపురంలో ఆదిత్యబిర్లా తొలి దశలో రూ.841 కోట్ల అంచనా వ్యయంతో గ్రాసిమ్‌ ఇండస్ట్రీ ఉత్పత్తి ఇటీవలనే ప్రారంభించింది. ఈ కర్మాగారం ద్వారా 1203 మందికి  జీవనోపాధి లభిస్తోంది.

► గతంలో చంద్రబాబు పాలనలో గ్రాసిమ్‌ కర్మాగారం ఏర్పాటు వివాదాలతో అటకెక్కగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చొరవతో ఆదిత్య బిర్లా ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించింది.

► తొండంగి మండలం పెరుమాళ్లపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల మధ్య సుమారు రూ.2000 కోట్లతో గేట్‌వే ఆఫ్‌ కాకినాడ పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా గ్రూప్‌ అరవిందో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడున్న రెండు పోర్టులకు అదనంగా కాకినాడ గేట్‌వే పోర్టుకు ఇప్పటికే తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పునాదిరాయి పడింది.

► కాకినాడ ఎస్‌ఈజడ్‌లో రూ.90 కోట్లతో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ గత ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. (క్లిక్‌: సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ)

► పెద్దాపురం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో రూ.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న దేవీ సీఫుడ్స్‌కు చెందిన ఆక్వా సీడ్‌ కంపెనీ త్వరలో అందుబాటులోకి రానుంది.  ళీ    తుని నుంచి అంతర్వేది వరకు పలు ఐస్‌ఫ్యాక్టరీలు, థర్మాకోల్‌ తయారీ ప్లాంట్‌లు ఏర్పాటు అవుతున్నాయి. 


నమ్మకంతో వస్తున్నారు 

తీర ప్రాంతంలో ఏర్పాటవుతోన్న పరిశ్రమలతో యువతకు ఉజ్వల భవిష్యత్‌ లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కుని ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. భూములతో వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించారు. అందుకే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేశారు. ఇందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టి, అతనిపై నమ్మకం ఉండటంతోనే పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో రెండువేల ఎకరాలను బల్క్‌ డ్రగ్‌ పార్కుకు కేటాయిస్తున్నాం. కోదాడ, పెరుమాళ్లపురం గ్రామాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్కుకు భూమిని కేటాయిస్తారు. 
– దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాలు శాఖా మంత్రి


మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట 

ప్రజా సంకల్పయాత్రలో కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. సుమారు 25 ఏళ్లుగా కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. మినీ హార్బర్‌ నిర్మించాలని మత్స్యకారులు అడిగితే ఏకంగా మేజర్‌ హార్భర్‌ నిర్మాణంకు సీఎం చర్యలు తీసుకోవడం ఒక చారిత్రక నిర్ణయం. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాదించడానికి మత్స్యకారుల అభ్యున్నతికి మేజర్‌ హార్భర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.  
–పెండెం దొరబాబు, ఎమ్మెల్యే పిఠాపురం  

మరిన్ని వార్తలు