Cyclone Jawad: తప్పిన ముప్పు.. బలహీనపడిన జవాద్‌

5 Dec, 2021 13:13 IST|Sakshi
శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లవానిపేటలో మత్స్యకారుల్ని అప్రమత్తం చేస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్, పోలీస్‌ బృందాలు

తీవ్ర వాయుగుండంగా మారిన తుపాను.. ఒడిశా వైపు పయనం

శ్రీకాకుళం జిల్లాపైన ఓ మోస్తరు ప్రభావం.. పలుచోట్ల వర్షాలు 

నేడు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

ఊపిరిపీల్చుకున్న అధికారులు, ప్రజలు

జవాద్‌’పై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమీక్ష 

ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ 

సన్నాహక చర్యలపై ప్రశంసలు  

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం/పిఠాపురం: ఉత్తరాంధ్రకు జవాద్‌ తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తుపాను శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తుపాను ప్రభావం ఓ మోస్తరుగా శ్రీకాకుళం జిల్లాపైనే కనిపించింది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదు కాలేదు. మొత్తంగా జవాద్‌ తుపాను ప్రభావం భయపెట్టినంతగా మన తీరంపై ప్రభావం చూపకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

తుపాను బలహీనపడి ఒడిశా వైపు కదలడంతో మన తీరంలో తేలికపాటి వర్షాలు మినహా భారీ వర్షాలకు అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు. ప్రస్తుతం జవాద్‌ విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 180 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 260 కి.మీ., పూరీకి 330 కి.మీ., పారదీప్‌కు 420 కి.మీ. దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 12 గంటల్లో మరింత క్రమంగా బలహీనపడి ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా పూరీ దగ్గరకు చేరుతుంది. ఆ తర్వాత ఒడిశా కోస్తా  వెంబడి ప్రయాణించి పశ్చిమ బెంగాల్‌ తీరం వైపునకు వెళ్లే అవకాశం ఉంది. 

శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు
కాగా, జవాద్‌ ప్రభావంతో శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గార మండలం తులుగులో 7.1 సెంటీమీటర్లు, పలాస, కొర్లాంలో 5.5, సంతబొమ్మాళిలో 5.4, రాజాపురంలో 5.1, పొలాకి, ఇచ్ఛాపురంలో 4.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో సగటున 3.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. పలాసలో అత్యధికంగా 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రణస్థలంలో 2.2, లావేరులో 1.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం (నేడు) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారముందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 

శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థిని మృతి
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో బలమైన గాలులకు పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వజ్రపుకొత్తూరు మండలం గోపీనాథపురంలో కొబ్బరి చెట్టు విరిగి పడి ఇంటర్‌ విద్యార్థిని గోరకల ఇందు(16) మృతి చెందింది. అదే మండలంలోని గోవిందపురంలో రెండు ఆవులు, మూడు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా కనిపించింది. తీర ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలిచారు. 

ఉప్పాడలో దెబ్బతిన్న 20 ఇళ్లు
తూర్పుగోదావరి జిల్లాపై తుపాను ప్రభావం లేనప్పటికీ సముద్రం కల్లోలంగా మారి కెరటాలు ఎగసిపడ్డాయి. తీరానికి చేరువగా ఉన్న 20 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయని బాధిత మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ లైట్‌హౌస్‌ నుంచి ఉప్పాడ వరకు తీర రహదారి కోతకు గురయింది. కెరటాల ఉధృతికి ఎన్‌టీపీసీ సమీపంలోని పెద్ద వంతెన శిథిలావస్థకు చేరి కూలిపోడానికి సిద్ధంగా ఉంది

వరద ముప్పును నివారించండి: మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ 
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో వరద ముప్పును నివారించడానికి చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి తుపాను ప్రభావం ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల జలవనరుల శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, వచ్చే ప్రవాహాల ఆధారంగా.. దిగువకు ప్రవాహాన్ని విడుదల చేస్తూ వరద ముప్పును తప్పించాలని సూచించారు. చెరువు కట్టలు తెగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు